ఎస్టీ యువకునికి అన్యాయం.. కేసు నమోదులో జాప్యం | - | Sakshi
Sakshi News home page

ఎస్టీ యువకునికి అన్యాయం.. కేసు నమోదులో జాప్యం

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

విచారణ చేపట్టిన గిరిజన సంక్షేమ శాఖ అధికారులు

మద్దిపాడు: మండలంలోని కొలచనకోట ఎస్టీ కాలనీకి చెందిన యాకసిరి నాగసాయి కార్తీక్‌ ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మంచాన పడటంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. బాధితుడికి న్యాయం చేయాలని, తన కుమారుడి పరిస్థితిని గాలికొదిలేసిన యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరినా మద్దిపాడు పోలీసులు స్పందించకపోవడంపై బాధితుని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, విచారణ చేపట్టారు.

ఇదీ జరిగింది..

డిగ్రీ పూర్తి చేసిన నాగసాయి కార్తీక్‌ జీవనోపాధి కోసం స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌ వద్ద పనిచేస్తున్నాడు. ఏప్రిల్‌ 7న విధుల్లో భాగంగా కేబుల్‌ స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన కార్తీక్‌ చికిత్స పొందుతున్నప్పటికీ, యజమాని కనీసం పట్టించుకోకపోవడంతో తల్లి మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మీడియాలో కథనాలు వచ్చినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితుని తల్లి ఒంగోలు గ్రీవెన్స్‌లో జేసీ కల్పనాకుమారి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో స్పందించిన జేసీ, వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మద్దిపాడు ఎస్సైని ఆదేశించారు. బాధితులకు న్యాయం జరగకపోవడంతో వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించారు. ఈ వ్యవహారం గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌ భార్గవి దృష్టికి వెళ్లడంతో, వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని నెల్లూరు ఐటీడీఏ (యానాది ప్లెయిన్‌ ఏరియా) పీఓకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పీఓ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, నెల్లూరు ఐటీడీఏ ఏపీఓలు నిరంజన్‌, అంకయ్య కొలచనకోటకు చేరుకున్నారు. బాధితుడి పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ ఆర్థిక పరిస్థితులపై ఆరా తీశారు. తక్షణ వైద్య అవసరాల కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. విచారణ నివేదికను డైరెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. మరోవైపు, పోలీసులు ఇప్పటికై నా స్పందించి కేసు నమోదు చేయకపోతే సోమవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద అన్ని కుల సంఘాలతో కలిసి భారీ ధర్నాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement