‘రూపాయి పన్ను’పై డీపీఓ విచారణ | - | Sakshi
Sakshi News home page

‘రూపాయి పన్ను’పై డీపీఓ విచారణ

Jun 26 2026 7:45 AM | Updated on Jun 26 2026 7:45 AM

‘రూపాయి పన్ను’పై డీపీఓ విచారణ పేకాట శిబిరంపై పోలీసుల దాడి

దొనకొండ (కురిచేడు): మండల కేంద్రమైన దొనకొండ మేజర్‌ పంచాయతీలో నిధుల దుర్వినియోగం జరగలేదని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) ఎం.అనుపమ స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో 200 వాణిజ్య భవనాలకు ఆస్తి పన్ను రూపాయి చొప్పున వసూలు చేశారనే ఫిర్యాదుపై ఆమె గురువారం బహిరంగ విచారణ చేపట్టారు. పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణచైతన్య ఆదేశాల మేరకు స్థానిక అధికారులతో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ క్రమంలో రూపాయి పన్ను నమోదు చేసిన 173 అసెస్‌మెంట్లను గుర్తించారు. వాటిని శిథిలావస్థకు చేరిన భవనాలు, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, పాఠశాలలు, హాస్టళ్లు, మాజీ సైనికుల ఇళ్లుగా తేల్చారు. నిబంధనల ప్రకారం వీటికి పన్ను మినహాయింపు ఉండగా, సాఫ్ట్‌వేర్‌లో సదరు అసెస్‌మెంట్లను తొలగించే ఆప్షన్‌ లేని కారణంగా నామమాత్రంగా రూపాయి నమోదు చేసినట్లు ఆమె వివరించారు. ఎటువంటి అవకతవకలు జరగలేదని విచారణలో స్పష్టమైందని ఆమె వెల్లడించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వసంతరావు నాయక్‌, డిప్యూటీ ఎంపీడీఓ బండారి శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి పోట్ల కృష్ణమూర్తి పాల్గొన్నారు.

11 మంది జూదరుల అరెస్టు

రూ.50,160 నగదు, 8 బైకులు స్వాధీనం

పొదిలి రూరల్‌: పొదిలి మండలం ఉప్పలపాడు పంచాయతీ గోగినేనివారిపాలెంలో బుధవారం అర్ధరాత్రి నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. సమాచారం అందుకున్న సీఐ రాజేష్‌కుమార్‌ ఆదేశాలతో ఎస్సై సూరెడ్డి రాజేష్‌ తన సిబ్బందితో కలిసి పొలాల్లో పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.50,160 నగదు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement