చెరబట్టి.. గండ్లు కొట్టి.. | - | Sakshi
Sakshi News home page

చెరబట్టి.. గండ్లు కొట్టి..

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

చెరువుల్లో మట్టి మాఫియా విధ్వంసం అక్రమార్కుల ఆగడాలపై అధికారుల మౌనం

మట్టి మాఫియా రెచ్చిపోతోంది. చెరువుల కట్టలు, మంచినీటి వనరులు అన్న విచక్షణ లేకుండా యంత్రాలతో మట్టిని తవ్వేస్తూ అక్రమంగా తరలిస్తున్నారు. కొత్తపట్నం మండలం అల్లూరు, ఒంగోలు సమీపంలోని కొప్పోలు గ్రామాల్లో సాగుతున్న గ్రావెల్‌ అక్రమ రవాణాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరు చెరువులో మాఫియా కనుసన్నల్లో జేసీబీలు, పొక్లెయిన్లు నిరంతరం పని చేస్తున్నాయి. చెరువు కట్టను కూడా వదలకుండా మట్టిని తవ్వేస్తుండటంతో కట్ట బలహీనపడింది. లారీల రాకపోకల కోసం ఏకంగా కట్టకు గండికొట్టారు. ఇక చెరువు పక్కన ఉన్న చిన్నపాటి చప్టాపై నుంచి భారీ లోడ్‌తో టిప్పర్లు వెళ్తుండటంతో, అది ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కొప్పోలు గ్రామంలోని మంచినీటి చెరువు పరిస్థితి మరీ దారుణం. మట్టి తత్వకాలతో చెరువు గర్భంలో భారీ గోతులు ఏర్పడ్డాయి. పక్కనే ఉన్న మరో చెరువులో సైతం మట్టి తవ్వి సమీపంలోని ప్రైవేట్‌ వెంచర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై దుమ్ము రేగకుండా ట్యాంకర్లతో తడుపుతూ అధికారుల కళ్లుగప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెరువులు దెబ్బతింటున్నా, అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది స్థానికుల ప్రశ్న. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, చెరువుల వద్ద జరుగుతున్న అక్రమ తవ్వకాలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

– సాక్షి, ఒంగోలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement