పొదిలి: ‘బై నాన్న’ అని పాఠశాల గడప దాటిన కూతురు మాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతుండగానే.. ఆ తండ్రి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. పొదిలి పట్టణంలోని రథం రోడ్డులో బుధవారం జరిగిన ఈ ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. వివరాలు.. స్థానిక దర్శి రోడ్డు ఎస్‌ఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న చెరుకూరి రవికుమార్(48) వృత్తిరీత్యా కార్పెంటర్. బుధవారం తన కుమార్తెను మహర్షి పాఠశాలలో వదిలిపెట్టేందుకు బైక్‌పై వెళ్లాడు. పాఠశాల వద్ద కుమార్తెను దించి, ’బై నాన్న’ అని ఆ చిన్నారి చెప్పిన మాటలు మనసులో మెదులుతుండగా ఇంటికి బయలుదేరాడు. రథం రోడ్డు వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ రవికుమార్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అతను అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ రవికుమార్ మీదుగా వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న సీఐ రాజేష్‌కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. రవికుమార్ మృతితో భార్య, ఇద్దరు పిల్లల రోదనలు మిన్నంటాయి. ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్న తండ్రిని కోల్పోయిన ఆ చిన్నారి పరిస్థితి చూసి అక్కడున్నవారంతా కన్నీరుమున్నీరయ్యారు.
మితిమీరిన వేగమే కారణమా?
ఇంటికి, పాఠశాలకు, పని ప్రదేశానికి అతి తక్కువ దూరంలోనే నివసించే రవికుమార్, ఇలా రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంపై పట్టణ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ల మితిమీరిన వేగమే ప్రమాదాలకు కారణమని, అధికారులు ఇప్పటికై నా ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ట్రాక్టర్, టిప్పర్ రూపంలో దాపురించిన మృత్యువు
పొదిలి రథం సెంటర్ వద్ద ప్రమాదం


