దొంగిలించిన కారులో జల్సాగా తిరుగుతుండగా.. | - | Sakshi
Sakshi News home page

దొంగిలించిన కారులో జల్సాగా తిరుగుతుండగా..

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

ఒంగోలు టౌన్‌: దొంగిలించిన కారులో జల్సాగా తిరుగుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ విజయ కృష్ణ, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వరరావు ఆ వివరాలు వెల్లడించారు. ఒంగోలు నగరంలోని తంగెళ్ల ఖాశీం వీధికి చెందిన కొండపి వెంకట రాజశేఖర్‌ బలరాం కాలనీ శివారులో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. రాత్రివేళ ఇంటి ముందు కారు నిలిపి ఉంచారు. ఈ నెల 20వ తేదీ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి గేటు తాళం పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. ఇంటి తాళాన్ని కూడా పగులగొట్టి లోపల ఉన్న కారు తాళాలు తీసుకుని ఐ10 కారుతో ఉడాయించారు. రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. తాలూకా సీఐ విజయకృష్ణ, వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుధవారం పేర్నమిట్ట సమీపంలోని పాలకేంద్రం వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా, చోరీకి గురైన కారులో ఉన్న ఆగంతకులు చీమకుర్తి వైపు నుంచి ఒంగోలు వస్తూ పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కారును ఆపి విచారించగా, బలరాం కాలనీలో దొంగలించిన కారుగా నిర్ధారణ అయింది. కారులో ఉన్న గుంటూరు జిల్లా పొన్నూరు నేతాజీనగర్‌కు చెందిన షేక్‌ మదార్‌, అదే ప్రాంతానికి చెందిన కట్ట వాసుదేవ్‌ ఉరఫ్‌ టింకు, షేక్‌ బాజీ, ఏలూరు జిల్లా పెదపాడు ఇందిరా కాలనీకి చెందిన సత్తెనపల్లి రాకేష్‌లను అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వీరు చోరీలు చేసినట్లు నిర్ధారణ అయింది. దాంతో నిందితుల నుంచి కారుతో పాటుగా పొన్నూరులో దొంగలించిన ఒక హోండా షైన్‌ మోటారు బైకు, బుల్లెట్‌, టంగుటూరులో చోరీ చేసిన బజాజ్‌ పల్సర్‌, సింగరాయకొండ సుందరయ్య నగర్‌లో దొంగిలించిన గ్లామర్‌ మోటారు బైకు, ఒంగోలు ఆర్టీసీ బస్టాండు వద్ద చోరీ చేసిన వీవో మొబైల్‌ ఫోన్‌, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐలతో పాటు తాలూకా ఎస్సై శ్రీనివాసరావు, హెడ్‌ కానిస్టేబుల్‌ అన్వర్‌ బాషా, రామకృష్ణ, ఒంగోలు వన్‌టౌన్‌ ఏఎస్సై సురేష్‌, హెడ్‌కానిస్టేబుల్‌ సాయి, విజయ్‌, పీసీ అనిల్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌ వెంకట్‌ను ఎస్పీ హర్షవర్థన్‌రాజు అభినందించారు.

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

నిందితుల నుంచి కారు, పలు మోటారు బైకులు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement