రెరా చట్టంపై అవగాహన కలిగి ఉండాలి | - | Sakshi
Sakshi News home page

రెరా చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

ఏపీ రెరా చైర్మన్‌ శివారెడ్డి

ఒంగోలు సబర్బన్‌: ఆంధ్రప్రదేశ్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ–అమరావతి (ఏపీ రెరా) చట్టంపై అవగాహన కలిగి ఉండాలని ఏపీ రెరా చైర్మన్‌ ఆరె శివారెడ్డి పిలుపునిచ్చారు. ఒంగోలులోని ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఆడిటోరియంలో బుధవారం రెరా చట్టం– 2016 నిబంధనలు, వాటి అమలుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శివారెడ్డి మాట్లాడుతూ రెరా చట్టంలోని నిబంధనలపై అవగాహన కల్పించడం, చట్టం అమలులో భాగస్వాముల బాధ్యతలను వివరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. రియల్‌ ఎస్టేట్‌ (నియంత్రణ అండ్‌ అభివృద్ధి) చట్టం–2016లోని ముఖ్య నిబంధనలను వివరించారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పారదర్శకత, జవాబుదారీతనం, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రెరా చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. అలాగే ప్రమోటర్లు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, ఇతర భాగస్వాములు చట్టంలోని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన ఇంటరాక్టివ్‌ సెషన్లో పాల్గొన్న వారు ప్రాజెక్టుల నమోదు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్ల నమోదు, ప్రాజెక్టుల గడువు పొడిగింపు, చట్టపరమైన నిబంధనలు, ఇతర అనుసరణ అంశాలపై పలు సందేహాలను వ్యక్తం చేయగా, చైర్మన్‌ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో రెరా ప్రాజెక్టుల నమోదు శాతం మరింత పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, అర్హత కలిగిన అన్ని ప్రమోటర్లు తమ ప్రాజెక్టులను తప్పనిసరిగా ఏపీ రెరాలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏపీ రెరా సభ్యులు, డైరెక్టర్‌ జి.వి.జి.ఎస్‌.ప్రసాద్‌ హాజరై చట్టంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్‌ ప్రమోటర్లు, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్లు, ఇంజినీర్లు, ఆర్కిటెక్టులు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, వినియోగదారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement