అద్దంకి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందజేయాల్సిన క్రీడా సామగ్రిని (స్పోర్ట్స్ కిట్స్) అడ్డుకోవడం అత్యంత దారుణమని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ కక్షలతో ప్రత్యర్థులు ఎంతటి నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతోందని ధ్వజమెత్తారు. చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా సామగ్రిని అందజేయాలని నిర్ణయించామని, పది రోజుల క్రితమే ప్రధానోపాధ్యాయులతో చర్చించామని ఆయన వివరించారు. అయితే, విద్యార్థుల ప్రయోజనం కోసం ఉద్దేశించిన కిట్‌లను స్వీకరించకుండా పాఠశాల యాజమాన్యాలను కొందరు బెదిరిస్తున్నారని అశోక్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘రాజకీయాల్లో డీసెంట్‌గా వ్యవహరిస్తారని ఆశించాను, కానీ చిన్న పిల్లల ఆట వస్తువులను కూడా వద్దని చెప్పేంత ’లోక్లాస్’ మైండ్‌సెట్‌తో వ్యవహరించడం చూస్తుంటే బాధేస్తోంది. రాజకీయంగా ఎదుగుతున్నాననే అక్కసుతోనే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సేవా కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పాఠశాలల్లో అనుమతించకపోయినా, బహిరంగ ప్రదేశంలో కిట్లు ఉంచి విద్యార్థులందరికీ అందజేస్తానని వెల్లడించారు.
జూలై 4న ‘పల్నాడు హాస్పిటల్’ ప్రారంభం
రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా అద్దంకిలో కొత్తగా ’పల్నాడు హాస్పిటల్’ను అందుబాటులోకి తీసుకురాబోతున్నామని డాక్టర్ అశోక్‌కుమార్ ప్రకటించారు. తక్కువ ఫీజుతో అద్దంకి నియోజకవర్గ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
రాజకీయాల కోసం చిన్నారుల భవిష్యత్‌ను బలి చేయకండి
వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ అశోక్‌కుమార్ మండిపాటు


