సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
జిల్లా టీడీపీలో ఇద్దరు అగ్ర నేతల మధ్య కోల్డ్ వార్ తార స్థాయి చేరింది. ఆ ఇద్దరిలో ఒకరు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మరొకరు రాష్ట్ర మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి. వారి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆరు నెలలుగా మాటల యుద్ధం సాగుతోంది. సింగరాయకొండలో విగ్రహం దగ్గర మొదలైన వివాదం... కనిగిరి వేదికగా రచ్చకెక్కింది. తాజాగా ఇద్దరి మధ్య వివాదం ముదిరి పాకాన పడింది. సింగరాయకొండలోని బాలయోగి నగర్ సెంటర్‌లో దివంగత మాజీ ఎంపీ, ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి సోదరుడు మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం ఉంది. అయితే బాలయోగినగర్‌కు చెందిన వార్డు అధ్యక్షుడు నరశింహ రోడ్డు విస్తరణ పనుల పేరిట సుబ్బరామిరెడ్డి విగ్రహాన్ని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాడు. ఆ సమాచారం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి దృష్టికి స్థానిక టీడీపీ నాయకులు తీసుకెళ్లారు. దాంతో హుటాహుటిన మాగుంట నేరుగా అక్కడకు వెళ్లి తొలగిస్తున్న స్థానిక నాయకుడితో మాట్లాడారు. మంత్రి చెబితే చేస్తున్నానని చెప్పటంతో మాగుంట ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో అతని లిక్కర్ ఫ్యాక్టరీకి చెందిన అధికారులను పిలిపించి, స్థానిక కొంతమంది టీడీపీ నాయకులను దగ్గర పెట్టి ధ్వంసం చేసిన దిమ్మెను పునర్నిర్మింపజేశారు. తరువాత విగ్రహానికి దిమ్మెకు రంగులు కూడా వేయించారు. ఇది ఆరు నెలల క్రితం జరిగిన తంతు...
కనిగిరి వేదికగా..
కనిగిరిలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రి కూడా వచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరశింహా రెడ్డిల ఆధ్వర్యంలో అంతర్గత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించే సమయంలో మంత్రి స్వామి కలుగజేసుకొని కొండపి నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు, నిధులు ఖర్చు చేసే విషయంలో తనకు సమాచారం కూడా ఇవ్వటం లేదని మాగుంటను ఉద్దేశించి అన్నారు. తన విషయంలో ప్రొటోకాల్ కూడా పాటించటం లేదని ఫిర్యాదు చేశారు. పక్కనే ఉన్న ఎంపీ మాగుంట మంత్రికి ఘాటుగానే సమాధానమిచ్చారు. కొండపి నియోజకవర్గంలో ఎంపీ అన్న గౌరవం మీరు ఇస్తున్నారా అని నిలదీశారు. దాంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగింది. దీంతో సమావేశంలో ఉన్న కేంద్రం మంత్రి, రాష్ట్ర మంత్రులు నివ్వెరపోయారు.
మాగుంట సర్కిల్ బోర్డును పీకేయించిన మంత్రి స్వామి...
నాలుగు రోజుల క్రితం బాలయోగి నగర్ సెంటర్‌లోని మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద సింగరాయకొండ, పకీరు పాలెంకు చెందిన మాగుంట అనుచరులు మాగుంట సర్కిల్ అని బోర్డు పెట్టారు. ఆ సమాచారం టీడీపీలోని కొందరు నాయకులు ఆ విషయాన్ని మంత్రి స్వామి దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన ఆ బోర్డును పీకేయించిన మంత్రి స్వామి దాని స్థానంలో పసుపురంగు వేసిన బోర్డుపై బాలయోగి నగర్ సర్కిల్ అని రాయించారు. మాగుంట సర్కిల్ బోర్డు స్థానంలో నూతనంగా ఏర్పాటు చేశారు. దీనిపై మాగుంట రాష్ట్ర మంత్రి స్వామిపై రగిలిపోతున్నారు. అనంతరం సింగరాయకొండ గురుకుల పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమానికి వస్తానని చెప్పిన మాగుంట సింగరాయకొండలో ఉన్నా కూడా మంత్రి స్వామి పాల్గొన్న కార్యక్రమం కాబట్టి పాల్గొనకుండా ఒంగోలు వెళ్లిపోయారు.


