ఏడు లీటర్లకు రూ.12 లక్షలు బిల్లు ! కాంట్రాక్టర్ ఒత్తిడితో నిబంధనలకు విరుద్దంగా జనరల్ ఫండ్ నిధులు డ్రా గుర్తించిన పంచాయతీరాజ్ శాఖ కమిషనర్
కందుకూరు రూరల్: కందుకూరు మండలంలోని మహదేవపురం పంచాయతీలో నిధులు స్వాహా జరిగినట్లు పంచాయతీ రాజ్‌శాఖ కమిషనర్ కృష్ణతేజ గుర్తించారు. మంగళవారం ప్రకాశం జిల్లా అధికారులో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ పంచాయతీల్లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెబుతూ కందుకూరు మండలంలోని మహదేవపురంలో ఏడు లీటర్ల ఆయిల్‌కు రూ.12 లక్షలు నిధులు ఖర్చు చేసినట్లు బిల్లు ఉందని ప్రస్తావించారు. ఈ విధంగా డీజిల్, పెట్రోల్‌కు ఇంత నిధులు ఖర్చు చేస్తున్నారని దీనిపై విచారించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో డీపీఓ పి.వెంకటేశ్వర్లు బుధవారం మహదేవపురం సచివాలయానికి వచ్చారు. రికార్డులన్నీ తనిఖీలు చేసి, ఎం బుక్‌లు పరిశీలించారు. తనిఖీల్లో ఏడు వర్క్‌లు రూ.13.4 లక్షలు ఖర్చు చేసినట్లు బిల్లులు ఉండగా ఇందులో డీజిల్, పెట్రోల్ హెడ్ కింద ఏడు లీటర్లకు రూ.12 లక్షలు ఖర్చు అయినట్లు బిల్లు నమోదు చేసి ఉందన్నారు. ఏడు వర్కులు కింద సైడు డ్రైన్లు, రోడ్డు, పైపు లైన్ల నిర్మాణంకు నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. నిర్మించిన సైడ్ డ్రైన్లు, రోడ్డును పరిశీలించారు. వీటితోపాటు బ్లీచింగ్ కింద రూ.42 వేలు, పారిశుధ్య కార్మికులకు జీతాల కింద రూ.31 వేలు, ఆఫీస్ మెయిటినెన్స్ కింద రూ.76 వేలు ఖర్చు చేసినట్లు చూపించారు. ఇవి గడిచిన నాలుగైదు నెలల్లో ఖర్చు చేసినట్లు ఉంది. ఈ వర్క్‌లకు సంబంధించిన నిధులన్నీ డీపీఓ లాగిన్‌లో అప్రూవల్ అయిన తర్వాతనే నిధులు డ్రా చేయాల్సి ఉందన్నారు. కానీ పంచాయతీ కార్యదర్శి సద్దాం, కంప్యూటర్ ఆపరేటర్ నిబంధనలకు విరుద్ధంగా డీపీఓ అప్రూవల్ లేకుండా నిధులు డ్రా చేశారని తెలిపారు. అధికారులపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు ఆయన తెలిపారు. ఏడు వర్క్‌లకు అని నమోదు చేయబోయి ఏడు లీటర్లు అని నమోదు అయినట్లుగా చెబుతున్నారు. పంచాయతీ కార్యదర్శి సద్దాం బదిలీపై వెళ్తున్నాడు. దీంతో కాంట్రాక్టర్ ఒత్తిడితో జనరల్ ఫండ్‌లోని నిధులు నిబంధనలకు విరుద్ధంగా డ్రా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. మిగిలిన ఇతర ఫండ్‌లో బిల్లులు చేయాలంటే త్వరగా కావనే ఉద్దేశంతో డీపీఓ అప్రూవల్ లేకుండా వక్రమార్గంలో కార్యదర్శి, కంప్యూటర్ ఆపరేటర్ నిధులు డ్రా చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
మహదేవపురం పంచాయతీలో ఏడు లీటర్లకు రూ.12 లక్షల నిధులు డ్రా చేసిన విషయం చర్చనీయాంశమైంది. అయితే పంచాయతీలో డీజిల్, పెట్రోల్ వాడే వాహనాలు ఏమున్నాయని గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. ఈ పంచాయతీకి చెత్త సేకరించేందుకు ఒక ఆటోను ఉంది. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఒకటి, రెండు నెలలు చెత్త కోసం తిరిగింది. తర్వాత చెత్త బండి ఎప్పుడో ఒక రోజు వాడుతుంటుంటారు. ఆ చెత్త ఆటోకి ఆయిల్ బిల్లులు పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే సంక్రాంతి పండగ రోజు మినహా తర్వాత పంచాయతీలో బ్లీచింగ్ చల్లిన పాపనపోలేదని గ్రామస్తులు చెబుతున్నారు. అదే విధంగా పంచాయతీలో సచివాలయం మెయింటినెన్స్ కింద నాలుగైదు నెలలకు రూ.76 వేలు ఖర్చు చేసినట్లు చూపించారు. ఈ విధంగా ఒక పంచాయతీ కార్యదర్శి బదిలీపై వెళ్తుంటే కాంట్రాక్టర్‌కు జేబు నింపేందుకు రకరకాల పనులు పేర్లు పెట్టి నిధులు డ్రా చేసి ఇచ్చారు. ఇందులో అధికారుల వాటా కూడా ఉంటుంది. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఉన్నతాధికారులు విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. డీపీఓ వెంట ఇన్‌చార్జ్ ఎంపీడీఓ పి.ఓబులేసు, ఇన్‌చార్జ్ కార్యదర్శి సీహెచ్.స్వప్న, స్వచ్ఛభారత్ కో ఆర్డినేటర్ ఎం.రమణయ్య ఉన్నారు.


