‘‘సర్‌’’లో నిబంధనలు ఉల్లంఘించరాదు | - | Sakshi
Sakshi News home page

‘‘సర్‌’’లో నిబంధనలు ఉల్లంఘించరాదు

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మేరకే ప్రక్రియ జరగాలి ఓటు లేకపోతే ఫారం–6 ద్వారా తీసుకోవచ్చు కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్‌ ఏటూరి భాను ప్రకాష్‌

ఒంగోలు సబర్బన్‌: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ(సర్‌) నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించరాదని కేంద్ర ఎన్నికల డిప్యూటీ కమిషనర్‌ ఏటూరి భాను ప్రకాష్‌ చెప్పారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్‌ యాదవ్‌, కేంద్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ కుమార్‌లతో కలిసి బుధవారం ఆయన ఒంగోలు వచ్చారు. జిల్లాలో ‘సర్‌’ ప్రక్రియలో పురోగతిపై కలెక్టర్‌ పి.రాజాబాబు, జాయింట్‌ కలెక్టర్‌ కల్పనా కుమారిలతో కలిసి ప్రకాశం భవనంలో వీరు ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ, డిజిటైజేషన్‌ చేస్తున్న తీరు, పురోగతిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా భాను ప్రకాష్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన ప్రకారమే ఈ ప్రక్రియ జరగాలన్నారు. క్షేత్రస్థాయిలో బీఎల్‌ఓలు సమర్థంగా పనిచేస్తేనే పారదర్శకమైన ఓటర్ల జాబితా సాధ్యమవుతుందన్నారు. ఈ దిశగా ఈఆర్వోలు తమ పరిధిలోని ఏఈఆర్వోలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలతో నిత్యం సంభాషిస్తూ పురోగతిని గమనిస్తూ ఉండాలని ఆయన చెప్పారు. క్షేత్ర స్థాయి సిబ్బంది రోజులో కనీసం ఐదు గంటలు ఫీల్డ్‌లో ఉండాలని డిప్యూటీ కమిషనర్‌ స్పష్టం చేశారు. అప్పుడే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుస్తాయన్నారు. కేవలం ‘సర్‌’ మాత్రమే కాకుండా పోలింగ్‌ కేంద్రాల మార్పిడి, వాటి పరిధిలో మార్పు కోరుకుంటున్న ఓటర్ల వంటి విషయాలు ఇప్పుడు గమనిస్తేనే ఎన్నికల సమయంలో ఇబ్బందులు లేకుండా చేయవచ్చన్నారు. జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్‌ ఈ సందర్భంగా వివరించారు. రాజకీయ పార్టీలు కూడా వాటి తరఫున బీఎల్‌ఏలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. మొత్తంగా చూస్తే జిల్లాలో ఎన్యుమరేషన్‌ ఫారాల పంపిణీ సగటున 80 శాతం వరకు ఉందని, డిజిటైజేషన్‌ ప్రక్రియలో కూడా పురోగతి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన ఓటర్లు అందరూ జాబితాలో ఉండేలా చూస్తున్నామన్నారు. ఎవరిదైనా ఓటు లేకపోతే ఫారం–6 నింపడం ద్వారా నమోదు చేసుకోవచ్చని అవగాహన కల్పించామన్నారు. సమావేశంలో సబ్‌ కలెక్టర్‌ డి.హిమవంశీ, డీఆర్‌ఓ మాధురి, అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement