చంద్రబాబు మాటకు విలువ లేదు | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మాటకు విలువ లేదు

Jun 25 2026 12:48 AM | Updated on Jun 25 2026 12:48 AM

సీఎం పొగాకును రూ.200కు కొనమంటే వ్యాపారులు రూ.160 కే కొంటున్నారు వ్యాపారులపై ఒత్తిడి చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ఒంగోలు టౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు పొగాకు కిలో రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఇటీవల ఆదేశాలు ఇచ్చారని, అయితే వ్యాపారులు మాత్రం కేవలం రూ.160లకు కొనుగోలు చేస్తున్నారని, సీఎం చంద్రబాబు మాటకు విలువలేకుండా పోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. సీఎం మాటలకు విలువుంటే వ్యాపారుల మీద ఒత్తిడి చేసి చెప్పిన ధరకు కొనుగోలు చేయించాలని డిమాండ్‌ చేశారు. త్రోవగుంట సమీపంలో ఉన్న పొగాకు వేలం కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. వేలం ఎలా జరుగుతుంది.. ఎంతకు కొంటున్నారని రైతులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన పొగాకు తీసుకొచ్చినా బాగాలేదని సాకులు చెప్పి గ్రేడ్‌ తగ్గించి వేస్తున్నారని కొందరు రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. చంద్రబాబు చెప్పిన రేటుకు పొగాకు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. దీంతో పొగాకు రైతులు ఐక్య పోరాటాలు చేస్తేనే గిట్టుబాటు ధర లభిస్తుందని, ప్రభుత్వం దిగివస్తుందని శ్రీనివాసరావు చెప్పారు. లేకపోతే ప్రభుత్వం చెప్పేది ఒకటి వ్యాపారులు చేసేది మరొకటి ఉంటుందన్నారు. పొగాకు రైతులు చేస్తున్న పోరాటానికి సీపీఎం మద్దతుగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, జయంతి బాబు, పమిడి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement