పెద్దదోర్నాల: మండల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు తమ ఓట్ల మార్పులు, చేర్పులపై అప్రమత్తంగా ఉండాలని యర్రగొండపాలెం ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ నాయకులు, బూత్ కన్వీనర్‌లకు సూచించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో మండల కన్వీనర్ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ప్రక్రియలో టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నే అవకాశం ఉందన్నారు. పార్టీకి చెందిన ఓట్లు కోల్పోకుండా ప్రతి ఒక్క కార్యకర్త జాగ్రత్త తీసుకోవాలని పేర్కొన్నారు. కార్యకర్తలు, బూత్ లెవల్ ఏజంట్లు తప్పని సరిగా కార్యక్రమంలో నిమగ్నం కావాలని కోరారు. ఓటు హక్కు కలిగిన వారికి సంబంధించిన ఫారాలను భర్తీ చేసి అందజేయటం, ఓటు హక్కు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలాంటి ఆధారాలు సమర్పించాలనే విషయాలపై ఓటర్ల వద్దకే వెళ్లి అవగాహన కల్పించాలన్నారు. ఓట్లలో లోపాలను సరిదిద్ది బీఎల్‌ఓలకు సమర్పించేలా అందరూ పని చేయాలని ఎమ్మెల్యే కోరారు. గ్రామాలకు బీఎల్‌ఓలు వచ్చినప్పుడు పార్టీ నాయకులు వారి వెంట ఉండి ప్రతి అంశాన్ని పరిశీలించాలన్నారు. నెల రోజుల పాటు ప్రక్రియ జరుతుంది కాబట్టి ఏ ఒక్క ఓటు రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చక పోవటంతో టీడీపీపై ప్రజలు ఆగ్రహంలో ఉన్నారన్నారు. ఈ ప్రక్రియలో పొరబాటున ఒక్క ఓటు తొలగిపోతే మళ్లీ చేర్చేందుకు ఎంతో సమయం పడుతుందని అన్నారు. ఇంటి వద్దకు బీఎల్‌ఓలు వస్తే ఇంట్లోని పేర్లను సరిచూసుకొని వారి వద్ద నుంచి రసీదు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న సర్ టాస్క్‌ఫోర్స్ సభ్యులు పత్తి రవిచంద్ర మొబైల్ యాప్‌లో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో మండల నాయకులు చిట్టె వెంకటేశ్వరరెడ్డి, గుమ్మాయల్లేష్, గంటా గురవారెడ్డి, దూదేకుల రసూల్, బొగ్గరపు రమేష్, ఒంటేరు నాగేశ్వరరావు, చిట్యాల యోగయ్య, గుండారెడ్డి రమణారెడ్డిలతో పాటు మండలానికి చెందిన ముఖ్య నాయకులు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్


