కందుకూరు: గంజాయి సరఫరాకు సంబంధించిన కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కందుకూరు ప్రాంతంలో గంజాయి విక్రయాలు, సరఫరా, రవాణాకు సంబంధించి ఇప్పటికే పలువురిని అరెస్టు చేసి జైల్‌కు పంపామన్నారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసులో కీలక నిందితులను వరుసగా అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్న పట్టణంలోని బండపాలెంకు చెందిన కత్తుల కిశోర్, గుడ్లూరు గ్రామానికి చెందిన కామంచి రాజేష్‌లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిద్దరూ గంజాయి సరఫరాలో కీలక నిందితులుగా ఉన్నారని, కందుకూరు ప్రాంతంలో ప్యాకెట్లుగా గంజాయి విక్రయించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కొంత కాలంగా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వీరిపై ప్రత్యేక నిఘా ఉంచి అదుపులోనికి తీసుకున్నట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 2.350కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే ఈ కేసులో మరికొంత మంది నిందితుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుందని తెలిపారు. గంజాయి విక్రయించే వారు, తాగుతున్న వారి వివరాలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే కందుకూరు పోలీస్ అధికారులు 9121102202, 9121102203 నంబర్లకు, 9121102266 అనే వాట్సప్ నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సీఐ షేక్ అన్వర్‌బాష, రూరల్ ఎస్సై బాలక్రిష్ణ, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
2.350 కేజీల గంజాయి స్వాధీనం
గంజాయి కేసులో ప్రతి నిందితున్ని అరెస్టు చేస్తాం
విలేకరుల సమావేశంలో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం


