ఒంగోలు టౌన్: చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుపేదల పొట్టలు కొట్టి ధనవంతుల కొమ్ము కాస్తోందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.అజయ్‌కుమార్ విమర్శించారు. సీఐటీయూ సీనియర్ నాయకుడు కాలం సుబ్బారావు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ...షెడ్యూల్ పరిశ్రమల్లోని 71 రంగాల్లో వేతనాలు సవరించుకోవడంతో కార్మికుల శ్రమను పారిశ్రామికవేత్తలు కారుచౌకగా దోచుకుంటున్నారని ఆరోపించారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణాల్లో వేతనాలు పెంచినా మన రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం వేతనాలు పెంచడం లేదని ధ్వజమెత్తారు. ఈ మధ్య కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు నూరుశాతం పెరిగాయని, కుటుంబ వ్యయం విపరీతంగా పెరిగిందని చెప్పారు. గ్రానైట్, ఆక్వా, స్పిన్నింగ్ మిల్లులు, రైస్, ఆయిల్ మిల్లులు, గోడౌన్లు, షాపింగ్ మాల్స్, హాస్పిటళ్లు, పెట్రోలు పంపుల్లో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పెట్రోలు, గ్యాస్ ధరలు పెరగడంతో పేదల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారిందన్నారు. వలస కార్మికులకు నివాస వసతులు కల్పించకపోవడంతో పశువుల కొట్టాల వంటి చిన్న చిన్న నివాసాలలో బతుకీడుస్తున్నారని తెలిపారు. రోజుకు 14 గంటలు పనిచేస్తున్నా ఓటీ అమలు చేయడంలేదని, స్కీమ్ వర్కర్లు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ, ఎండీఎం, వీఓఏలకు వేతనాలు పెంచకుండా ప్రభుత్వాలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండీఎం కార్మికులకు రూ.3 వేల వేతనాలు ఇస్తూ జీవించే హక్కును ప్రభుత్వమే కాలరాస్తుందని చెప్పారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 10 ఏళ్ల సర్వీసు ఉంటే రెగ్యులర్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా పాలకులు పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులంతా జూలైలో జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జీవీ కొండారెడ్డి, పి.కల్పన, మంజుదార్, పి.ఆంజనేయులు, జి.రమేష్, వెంకటేశ్వర్లు, టి.రాము, ఆదిలక్ష్మి, చిరంజీవి, వీరాంజనేయులు పాల్గొన్నారు.


