● అండర్ 16లో ట్రిపుల్ సెంచరీ సాధించిన పృధ్వీరాజ్
● వాటిలో 61 బౌండరీలతో పరుగుల వరద
● అభినందనలు తెలిపిన ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్
కందుకూరు రూరల్: వయసుచిన్నదైనా.. వచ్చిన బాళ్లను వచ్చినట్లు చితక్కొడుతూ ట్రిపుల్ సెంచరీ బాదేశాడా చిచ్చరపిడుగు. అండర్ 16 అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు కృష్ణాజిల్లా మూలపాడులో జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పశ్చిమగోదావరి జిల్లాపై ప్రకాశం జట్టులోని ఎంఎల్ పృధ్వీరాజ్ అద్భుత ప్రతిభ చూపించాడు. కందుకూరు మండలంలోని కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన పృధ్వీరాజ్ అండర్ 16 విభాగంలో ప్రకాశం జిల్లా క్రికెట్ జట్టకు ఎంపికై సెంట్రల్ జోన్ పోటీల్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రకాశం జిల్లా జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 508 పరుగుల వద్ద డిక్లేర్ చేశారు. ప్రకాశం జిల్లా జట్టులోని ఎంఎల్ పృధ్వీరాజ్ రికార్డు స్థాయిలో 317 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్‌లో 61 బౌండరీలు ఉండటం విశేషం. దీనికి ముందు కృష్ణా జిల్లాతో జరిగిన మ్యాచ్‌లో కూడా 19 ఫోర్స్, 1 సిక్సర్ తో 122 పరుగులు, బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టి ప్రకాశంజిల్లా టీంకు మంచి ఆల్ రౌండర్‌గా నిలిచాడు. దీనిపై ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు, అధ్యక్షుడు పోతుల నవీన్, పృధ్వీరాజ్ తండ్రి రాజాతో పాటు, కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు.


