యమపురి దారులు.. | - | Sakshi
Sakshi News home page

యమపురి దారులు..

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

రోడ్లపై తెల్లారిన బతుకులు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం లారీని ఆటో ఢీకొని ముగ్గురు బైక్‌ అదుపు తప్పి ఒకరు, ఆటో–బైక్‌ ఢీకొని మరొకరు మృతి

సంతమాగులూరు(అద్దంకి): ప్రకాశం జిల్లాలో రోడ్లు యమపురికి రహదార్లుగా మారాయి. జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మణం చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బంధువుల పెద్దఖర్మకు వెళుతూ ముగ్గురు, అమ్మవారికి పొంగళ్లు కార్యక్రమానికి వెళ్లి వస్తూ ఒకరు, ఆర్వో ప్లాంట్‌ వద్ద నీళ్లు నింపుకుని వెళ్తూ మరొకరు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలు జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపాయి. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం తెల్లవారు జాము సంతమాగులూరు మండలంలోని కామేపల్లి గ్రామ సమీపంలో లారీని ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతిచెందారు. మరో ఆరుగురు గాయాలపాలయ్యారు. వీరంతా పల్నాడు జిల్లాలోని శావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే వేల్పూరు గ్రామానికి చెందిన దావులూరి ఏడుకొండలు(50), ముండ్రు రవణమ్మ(52), ఎలవర్తి సుబ్బులు, ముండ్రు సుబ్బాయమ్మ, గుత్తి సుబ్బాయమ్మ, ముండ్రు వెంకటరామయ్య, బోయపాటి అనురాధ, బోయపాటి లక్ష్మీదేవమ్మ, డీ చిన్న యోగమ్మ గ్రామానికి చెందిన కుంకలగుంట మీరావలి ఆటోలో నరసరావుపేటలోని తన బంధువు పెద్ద ఖర్మకు వెళ్లేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో వారి ఆటో సంతమాగులూరు మండలంలోని వినుకొండ–నరసరావుపేట హైవేపై, కామేపల్లి–వెల్లచెరువు గ్రామాల మధ్యలోకి చేరుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డుకు సమీపంలోని వీర హనుమాన్‌ గ్రానైట్‌ ఫ్యాక్టరీ నుంచి పొడవైన లారీ రోడ్డుమీదకు వస్తోంది. షడన్‌గా రోడ్డుపైకి వచ్చిన లారీని గుర్తించని ఆటో డ్రైవర్‌ లారీని ఢీ కొట్టడంతో ఆటో పక్కకు పడిపోయింది. ఈ ఆటోలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణిస్తుండగా, అందులోని దావులూరి ఏడుకొండలు, ముండ్రు రవణమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రగాయాల పాలైన ఏడుగురిని నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఎలవర్తి సుబ్బులు(70) మృతిచెందింది. ముండ్రు సుబ్బాయమ్మ, గుత్తి సుబ్బాయమ్మ, ముండ్రు వెంకటరామయ్య నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. తీవ్రగాయాల పాలైన బోయపాటి అనూరాధ, బోయపాటి లక్ష్మీదేవమ్మ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. డీ చిన్న యోగమ్మ చిన్న చిన్న దెబ్బలు కావడంతో ఆమె వెంటనే ఇంటికి వెళ్లిపోయింది. ఘోర ప్రమాదం జరిగిన సమయంలో స్థానికులు గుర్తించి వెంటనే ఆటోలో సంతమాగులూరు వైద్యశాలకు తరలించారు. ఘటన వివరాలు తెలుసుకున్న సంతమాగులూరు ఎస్సై పట్టాభిరామయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుతో దర్యాప్తు చేస్తున్నారు.

పోలేరమ్మ పొంగళ్లకు వెళ్లొస్తూ..

మర్రిపూడి: పోలేరమ్మ పొంగళ్లకు వెళ్లి తిరిగి వస్తూ చీమకుర్తి గ్రానైట్‌ క్వారీ డంపింగ్‌ ఆపరేటర్‌ ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన మర్రిపూడి మండలంలోని రాజుపాలెం సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన చిన్న బసప్ప(51) చీమకుర్తి గ్రానైట్‌ ఫ్యాక్టరీలో డంపింగ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఆదివారం తన స్నేహితుడు పొక్‌లైయిన్‌ ఆపరేటర్‌ పాపత్తు బల్లూరెడ్డితో కలిసి కనిగిరి మండలం ఎనిమిరెడ్డిపల్లి గ్రామంలో జరిగిన పోలేరమ్మ పొంగళ్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. పొంగళ్ల కార్యక్రమం ముగించుకుని గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మీదుగా ద్విచక్రవాహనంపై తిరిగి చీమకుర్తి వస్తున్నారు. మండలంలోని రాజుపాలెం సమీపంలోని హైవేపై ఉన్న రాళ్ల గుట్టలను గమనించకపోవడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. దీంతో ప్రమాదవశాత్తు రోడ్డుపై పడి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనం వెనకాల కూర్చున్న చిన్న బసప్ప(51) తలకు తీవ్ర రక్తగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రగాయాలైన బల్లూరెడ్డిని ఒంగోలు జీజీహెచ్‌కి తరలించారు. అపస్మారకస్థితిలో ఉన్న ఆయన్ను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు వైద్యశాలకు తరలించినట్లు ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు. విషయం తెలుసుకున్న రమేష్‌బాబు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొని ఒకరు మృతి

● మరో వ్యక్తి తీవ్ర గాయాలు

ఆటో, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొని మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వ్యక్తి మృతి చెందిన సంఘటన మర్రిపూడి మండలంలోని గార్లపేట పంచాయతీ సిద్దారెడ్డిపల్లి సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు మేరకు గార్లపేట గ్రామానికి చెందిన రాగిపిండి వెంకటేశ్వరరెడ్డి ఆర్వోప్లాంట్‌కు ఏర్పాటు చేసుకున్న ఆటోకు నీళ్లు నింపుకుని కనిగిరి మండలం పునుగోడు గ్రామానికి వెళ్లాడు. ఆదివారం రాత్రి నీళ్లు అమ్ముకుని తన ఆటోలో సింగిల్‌ లైట్‌ వేసుకుని తన సొంత గ్రామమైన గార్లపేటకు వస్తున్నాడు. అదే సమయంలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో కూలిపని చేసుకుంటూ జీవిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఒకే ద్విచక్ర వాహనం పై కనిగిరి వైపు వెళుతున్నారు. సిద్దారెడ్డిపల్లి గ్రామ శివారులో సింగిల్‌ లైట్‌తో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడిపోయారు. ఈ సంఘటనలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం రేవా జిల్లా హనుమన మండల పరిధిలోని చరైయా గ్రామానికి చెందిన దయాకర్‌ జైస్వాల్‌(44) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో కూలీ నీరజ్‌కు కుడికాలు విరగ్గా ఇంకో కూలీకి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు 108లో కనిగిరి కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement