లోకేష్ బోలెడన్ని హామీలు ఇచ్చారు..
పెట్టుబడులపై సమావేశాలా..?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
పారిశ్రామిక రంగంలో ఉమ్మడి జిల్లా రాష్ట్రంలోనే టాప్ 2–3 స్థానంలో ఉంటుంది. గ్రానైట్, ఆక్వా, పలకలు, ఇతర పరిశ్రమలపై జిల్లాలోని పారిశ్రామికవేత్తలు వేల కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చిన్న, మధ్య తరహా యూనిట్లు సుమారు 10 వేలకు పైగా ఉన్నట్లు అంచనా. ఒక్క సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌లో అధిక సంఖ్యలో ఎక్కువ యూనిట్లు ఉన్నాయి. వాటన్నిటికీ రావాల్సిన రాయితీలే సుమారు రూ.300 కోట్లకు పైగా ఉన్నట్లు పరిశ్రమల శాఖలోని గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి.
రాయితీల కోసం రెండేళ్లుగా పోరాటం..
రెండేళ్ల నుంచి రావాల్సిన ప్రోత్సాహకాల కోసం దళిత పారిశ్రామికవేత్తలు మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలోని పరిశ్రమల శాఖలోని కమిషనర్‌ను, సచివాలయంలోని ప్రిన్సిపల్ సెక్రటరీలను కలిసి పలు మార్లు వినతిపత్రాలు అందజేశారు. నెలవారి వాయిదాలను చెల్లించలేకపోవడంతో బ్యాంకర్‌ల నుంచి ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యలే శరణ్యమని అధికారులు, పరిశ్రమల శాఖ మంత్రితో గోడు చెప్పుకున్నారు. అయినా ఏ మాత్రం వారిలో చలనం లేదు. గంతలో ఎన్నడూ లేని విధంగా కులాలు, పార్టీల వారీగా పరిశ్రమల యజమానులను విడగొట్టి 20 శాతం రాయితీలను ఇచ్చి చేతులను దులుపుకున్నారు. అదే కార్పొరేట్ సంస్థలైన కియా కార్ల సంస్థలకు, పరిశ్రమల మంత్రికి సంబంధించిన వాటికి మాత్రం 100 శాతం రాయితీలు విడుదల చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దళితులు, మిగిలిన వర్గాలకు మాత్రం 20 శాతం ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మళ్లీ ఏడాది గడిచినా ఇంత వరకు పరిశ్రమలకు రావాల్సిన రాయితీలను ఎప్పుడు ఇస్తారో తెలియక బ్యాంకర్ల ఇబ్బందులు తాళలేక పరిశ్రమలను ఎందుకు పెట్టుకున్నామురా దేవుడా...? అని బోరున విలపించిన పరిశ్రమల యజమానులు పడుతున్న ఇబ్బందులపై సోషల్ మీడియా, కొన్ని టీవీ ఛానెల్స్, ప్రింట్ మీడియాలలో ప్రధాన వార్తలు వచ్చినా చంద్రబాబు ప్రభుత్వంలో కాస్తయినా చలనం లేదంటే ఏపీ రాష్ట్రంలో పరిశ్రమలకు నూకలు చెల్లాయని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యువగళం కార్యక్రమంలో భాగంగా నారా లోకేష్ జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు మండలాల్లోని పరిశ్రమల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు. అలవికాని హామీలు ఇచ్చారు. మీరు ఎంత మందికి పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పిస్తే అంత పెద్ద మొత్తంలో రాయితీలను అందిస్తామని లోకేష్ ఇచ్చిన హామీని చూసి పారిశ్రామికవేత్తలు మురిసిపోయారు. గడిచిన రెండేళ్లలో ఒక్కహామీ కూడా అమలు కాకపోవడంతో చంద్రబాబు, లోకేష్ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు అందక ఆర్థికంగా కుదేలవుతుంటే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం నగరంలోని ఓ కళ్యాణమండపంలో ‘‘బిజినెస్ ఎలైట్ మీట్’’ నిర్వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో పెట్టుబడులు పెట్టాలని బల్లికురవ, చీమకుర్తిలోని గ్రానైట్, రామాయపట్నంలోని పోర్టు వంటి పలు రంగాలను చూపించి పెట్టుబడులను ఆకర్షించాలని చేసే ప్రయత్నంపై పరిశ్రామిక యజమానులు పెదవి విరుస్తున్నారు. ముందు పెట్టిన పెట్టుబడులక్చు రావాల్సి వందల కోట్ల ప్రోత్సాహాలను ఇప్పించాలని అంటున్నారు. రెండేళ్ల నుంచి పారిశ్రామిక రంగానికి పాడెగట్టిన ఆనవాళ్లు కళ్లెదుటే కనిపిస్తుంటే మళ్లీ పెట్టుబడులు పెడితే పెట్టిన పెట్టుబడులు పెట్టిన వారికి ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు పలికేదెవరు...పట్టించుకునేదెవరు..? ముందున్న వారినే పట్టించుకోకపోతే ఇప్పుడొచ్చిన వారిని పట్టించుకుంటారా...? అంటూ ప్రభుత్వం నూతనంగా ఆహ్వానిస్తున్న పారిశ్రామికవేత్తలలో నిరుత్సాహం నెలకొందని ఆయా రంగాల ప్రతినిధులు వాపోతున్నారు.


