ఒంగోలు సబర్బన్: ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ పి.రాజాబాబు స్పష్టం చేశారు. సోమవారం ప్రకాశం భవనంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, డీఆర్‌ఓ మాధురి, డీపీఓ వెంకటేశ్వరరావుతో కలిసి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల అర్జీలను సకాలంలో, సహేతుకంగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పరిష్కరించలేని పక్షంలో అందుకుగల కారణాలను కూడా ప్రజలకు వివరించాలని చెప్పారు. తరచూ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని, పునరావృతం అవుతున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు.
అధికారులందరూ తమ లాగిన్‌లో పెండింగ్ ఉన్న అర్జీలను ప్రతిరోజూ పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు పల్లెనిద్ర, నియోజకవర్గ స్థాయి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాల్లో వస్తున్న అర్జీలకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మీ కోసంలో కలెక్టర్ పి.రాజా బాబు


