మద్దిపాడు:
సంతనూతలపాడు నియోజకవర్గంలో రేషన్ దందా కొత్తపుంతలు తొక్కుతోంది. పేదల బియ్యం భారీగా పక్కదారి పడుతోంది. ఇదంతా అధికారులకు తెలిసినా మామూళ్ల మత్తులో జోగుతూ ఆవైపు కన్నెత్తి చూడటం లేదు. వాస్తవానికి చాలా కాలంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. కేవలం యాభై నుంచి వంద కేజీల వరకూ బియ్యం రేషన్ డీలర్ల ద్వారా పక్కదారి పట్టేవి. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ దందా విచ్చలవిడిగా సాగుతోంది. సంతనూతలపాడు నియోజకవర్గంలో అధికార టీడీపీ ముఖ్య నాయకుడి కనుసన్నల్లో యథేచ్ఛగా జరుగుతోంది. పల్నాడుకు చెందిన వ్యక్తి ఈ మొత్తం వ్యవహారం చూసుకుంటున్నాడు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్కో మండలానికి ఇద్దరు అనుచరులను పెట్టుకుని మరీ బియ్యం దందా సాగిస్తున్నారు. ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సివిల్ సప్లయిస్, ఎన్‌ఫోర్స్‌మెంట్, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు ఎవరి స్థాయిలో వారు మామూళ్లు తీసుకుంటూ చోద్యం చూస్తున్నారు. పేదల నోటికాడి బియ్యాన్ని పంచుకుని తింటున్నారు.
రేషన్ డీలర్ వద్ద
రూ.15 నుంచి రూ.17 వరకూ కొనుగోలు...
సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి మండలంలో 51 రేషన్ షాపులు ఉన్నాయి. వాటికి 331 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. అదేవిధంగా సంతనూతలపాడు మండలంలో 35 షాపులకు 242 మెట్రిక్ టన్నులు, మరో 8 షాపులకు ఒంగోలులోని ఎంఎల్‌ఎస్ పాయింట్ ద్వారా 25 మెట్రిక్ టన్నులు, మద్దిపాడు మండలంలోని 31 రేషన్ షాపులకు 220 మెట్రిక్ టన్నులు, నాగులుప్పలపాడు మండలంలోని 53 రేషన్ షాపులకు 275 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సరఫరా అవుతోంది. మొత్తం 1093 మెట్రిక్ టన్నుల బియ్యంలో కనీసం వెయ్యికిపైగా మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోందంటే అతిశయోక్తి కాదు. ఈ రేషన్ దందా ద్వారా కోట్లాది రూపాయలను అధికార పార్టీ నాయకులు, అధికారులు బొక్కేస్తున్నారు. రేషన్ దుకాణదారుడు కేజీకి రూ.11 చొప్పున కార్డుదారునికి ఇచ్చి బియ్యం కొనుగోలు చేస్తుండగా, డీలర్ వద్ద నుంచి కాంట్రాక్టర్ రూ.15 నుంచి రూ.17 వరకూ చెల్లించి కొనుగోలు చేస్తున్నాడు. ఆ బియ్యాన్ని వారికి అనువైన రైస్ మిల్లులకు తరలించి అక్కడ పాలిషింగ్ చేయించడం, లేకపోతే అదే బియ్యాన్ని వేరే బస్తాల్లోకి మార్చి కేజీ రూ.30కిపైగా అమ్మడం చేస్తున్నారు.
మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ నెల మామూళ్లు...
రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ఎక్కడా బ్రేకులు పడకుండా ఉండేందుకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ సంబంధిత అధికారులకు నెలవారీగా మామూళ్లు ఇస్తున్నారు. దానికితోడు అధికార పార్టీ నియోజకవర్గ ముఖ్య నాయకుడి కనుసన్నల్లోనే దందా మొత్తం జరుగుతుండటంతో ఎవరూ దాని గురించి మాట్లాడలేని పరిస్థితి.
గతంలో నాయకుల మధ్య విభేదాలతో పట్టుబడిన బియ్యం...
నాగులుప్పలపాడు మండలంలో కూటమి ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్యనాయకుల మధ్య తలెత్తిన విభేదాల కారణంగా రేషన్ బియ్యం పట్టుబడిన విషయం చర్చనీయాంశమైంది. గత సంవత్సరం జూన్ 6వ తేదీ మద్దిపాడు సమీపంలోని ఒక రైస్‌మిల్లులో 2,108 బస్తాల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదే సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీ గుండ్లాపల్లి వద్ద పశ్చిమ ప్రాంతానికి చెందిన ఒక లారీ ప్రమాదవశాత్తూ తిరగబడగా, అందులో రేషన్ బియ్యం బయటపడింది. ఈ రెండు సంఘటనలు మినహా ఈ రెండు సంవత్సరాల కాలంలో ఎక్కడా అధికారులు రేషన్ షాపులు, గోడౌన్‌లు, రైస్ మిల్లులపై దాడి చేయకపోవడం చూస్తుంటే.. రేషన్ బియ్యం దందా ఏ స్థాయిలో జరుగుతోందో అర్థమవుతోంది.
మద్దిపాడు మండలంలోని రైస్‌మిల్లులో సీజ్ చేసిన రేషన్ బియ్యంతో అధికారులు (ఫైల్)
రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తూ గత సంవత్సరం గుండ్లాపల్లి వద్ద
తిరగబడిన లారీ
సంతనూతలపాడు నియోజకవర్గంలో విచ్చలవిడిగా రేషన్ బియ్యం అక్రమ రవాణా
నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుని కనుసన్నల్లో పేదల బియ్యం పక్కదారి
చక్రం తిప్పుతున్న పల్నాడుకు చెందిన వ్యక్తి
మండలానికి ఇద్దరు అనుచరులను పెట్టుకుని మరీ కార్యకలాపాలు
మామూళ్ల మత్తులో అధికారులు
పల్నాడు జిల్లా వ్యక్తి చక్రం తిప్పడంపై
రగిలిపోతున్న స్థానిక నాయకులు...
సంతనూతలపాడు నియోజకవర్గానికి సంబంధం లేని పల్నాడు జిల్లాకు చెందిన వ్యక్తి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తూ నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుడి ఆశీసులతో ఒక్కో మండలానికి ఇద్దరు చొప్పున అనుచరులను ఏర్పాటు చేసుకుని రేషన్ దందాలో చక్రం తిప్పడంపై ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు రగిలిపోతున్నారు. రేషన్ షాపుల వద్ద నుంచి బియ్యం సేకరించి గోడౌన్‌లకు చేర్చుతూ తిలాపాపం తలా పిడికెడు అన్న చందంగా ఎవరి మామూళ్లు వారికి అందిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నాడని టీడీపీ నాయకులే గుర్రుమంటున్నారు. నియోజకవర్గానికిగానీ, జిల్లాకుగానీ సంబంధం లేని వ్యక్తి ఇలా చక్రం తిప్పడం ఏంటని కొందరు నాయకులు మండిపడుతున్నారు.


