● ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
గిద్దలూరు రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 27వ తేదీ గిద్దలూరు మండలంలోని కె.ఎస్.పల్లె గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంగా సీఎం కో ఆర్డినేటర్ వెంకటేష్‌తో కలిసి మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయసునీత, ఎస్పీ హర్షవర్దన్‌రాజు సోమవారం ఆ గ్రామంలో ఏర్పాట్లను పరిశీలించారు. గ్రామంలోని పీహెచ్‌సీలో సంజీవని కార్యక్రమం ప్రారంభోత్సవానికి సీఎం వస్తుండగా, సంబంధిత ఏర్పాట్లను వారు పరిశీలించారు. హెలీప్యాడ్, సభా ప్రాంగణం, పరిసరాలతో పాటు వైద్యశాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. సభకు వచ్చే వీఐపీల కార్ల పార్కింగ్, ప్రజలకు కావాల్సిన వసతి, తదితర ఏర్పాట్లపై అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. వారి వెంట జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, ఆర్‌డీఓ వెంకట శివరామిరెడ్డి, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మార్కాపురం: స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి ప్రజా సమస్యలపై 39 అర్జీలు అందాయి. మార్కాపురం డీఎస్పీ యు..నాగరాజు పాల్గొని జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్ట పరిధిలో విచారణ జరిపి సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. ప్రధానంగా భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివాదాలు, చీటింగ్, కుటుంబ కలహాలు, అత్తింటి వేధింపులపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కాపురం సీఐ అల్తాఫ్ హుస్సేన్, పామూరు సీఐ వినోద్, సిబ్బంది పాల్గొన్నారు.
ఒంగోలు సబర్బన్: జిల్లాలో ఈ నెల 28న జరగనున్న పల్స్ పోలియోను విజయవంతం చేయాలని జాయింట్ కలక్టర్ కల్పనాకుమారి అన్నారు. పీజీఆర్‌ఎస్ భవన్‌లో పల్స్ పోలియోకు సంబంధించిన పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. అనంతరం పల్స్ పోలియో టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్పనా కుమారి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రములో ప్రతి జిల్లా అధికారి పాల్గొని విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రసుత్తం జిల్లాలో ఐదేళ్ల లోపు 156477 మంది పిల్లలు ఉన్నారని, వారందరికీ పోలియో చుక్కలు వేయించాలన్నారు. 1062 పోలియో కేంద్రాలు, 34 ట్రాన్సిట్ పోలియో కేంద్రాలు, 69 మొబైల్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు 4937 మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఆశాలు, అంగన్‌వాడీ వర్కర్లు, వలంటీర్లను నియమించినట్లు వెల్లడించారు. జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కమల, ఇతర అధికారులు పాల్గొన్నారు.
● డ్రైవర్‌కు గాయాలు
పెద్దారవీడు: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో చట్లమిట్ల గ్రామం సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదివారం రాత్రి శ్రీశైలానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జాతీయ రహదారి చట్లమిట్ల గ్రామం సమీపంలో రోడ్డుకు అడ్డంగా గెదే వెళ్తుంది. గెదేను తప్పించే క్రమంలో బస్సు చెట్టును ఢీకొట్టింది. ఇంతలోనే గెదే బస్సు కింద పడి చనిపోయింది. బస్సు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే బస్సు చెట్టుకు ఢీకొట్టడంతో డ్రైవర్ కదిరి రాంబాబు స్టీరింగ్‌లో చిక్కుకున్నాడు. ప్రయాణికులు వెంటనే డ్రైవర్‌ను బయటకు తీసి 108 వాహనంలో మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలు వైద్యశాలకు తీసుకెళ్లారు.


