చీరాల: చీరాల మండలంలోని ఈపూరుపాలెంలో 2024 జూన్‌లో యువతిపై లైంగికదాడికి పాల్పడి హత్యచేసిన ఇద్దరు ముద్దాయిలకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా, మూడో ముద్దాయికి ఐదేళ్ల శిక్ష, రూ.2 వేల జరిమానా విఽధిస్తూ సోమవారం ఒంగోలు కోర్టు రెండో అదనపు జిల్లా జడ్జి పి.లలిత తీర్పు చెప్పారు. ఆ వివరాల ప్రకారం... 2024 జూన్ 21న చీరాల మండలం ఈపూరుపాలెం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈపూరుపాలెం గ్రామానికి చెందిన 21 సంవత్సరాల యువతి బహిర్భూమికి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన దేవరకొండ విజయ్ (26), కారంకి మహేష్‌బాబు (23) ఆమెను ఈపూరుపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ గోడ వెనుక రైల్వేట్రాక్ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడి హత్య చేశారు. ఆమె చెవులకు ఉన్న బంగారు కమ్మలు అపహరించారు. అనంతరం ఇద్దరు నిందితులు దేవరకొండ శ్రీకాంత్ (24) వద్దకు వెళ్లగా అతడు వారికి ఆశ్రయం కల్పించి దాచిపెట్టాడు. హతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చీరాల రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. అప్పటి రూరల్ సీఐ ఎన్.సత్యనారాయణ కేసు విచారణలో భాగంగా ప్రత్యక్ష సాక్షులను విచారించారు. ముగ్గురు నిందితులు నేరానికి పాల్పడినట్లు తగిన సాక్ష్యాలతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఒంగోలు రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టులో కేసు విచారణకు రాగా, డీఎస్పీ ఎండీ మోయిన్ పర్యవేక్షణలో చీరాల రూరల్ సీఐ, ఎస్‌ఐలు, కోర్టు కానిస్టేబుల్ షేక్ కరిముల్లా సాక్షులను హాజరుపరిచారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కేవీ రామేశ్వరరెడ్డి, ఎన్.అవనీష్ కోర్టులో వాదనలు వినిపించి నిందితులపై మోపిన నేరాభియోగాలను తగిన సాక్ష్యాధారాలతో నిరూపించారు. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి పి.లలిత మొదటి ముద్దాయి దేవరకొండ విజయ్, రెండో ముద్దాయి కారంకి మహేష్‌బాబుకు యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున జరిమానా, మూడో ముద్దాయి దేవరకొండ శ్రీకాంత్‌కు ఐదేళ్ల కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. అలానే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కేసు దర్యాప్తును వేగంగా పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చేసిన పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ అభినందించారు.
నిందితులకు ఆశ్రయం కల్పించిన వ్యక్తికి ఐదేళ్ల జైలు
తీర్పు వెలువరించిన ఒంగోలు రెండో అదనపు జిల్లా జడ్జి పి.లలిత


