ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Jun 23 2026 2:04 AM | Updated on Jun 23 2026 2:04 AM

దర్శి (కురిచేడు): ప్రజా సమస్యలు, ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి పోలీస్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్పీ వి.హర్షవర్దన్‌రాజు తెలిపారు. పోలీస్‌ అధికారులతో కలిసి సోమవారం దర్శి పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శి పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదుదారులు ఎస్పీకి అర్జీలు అందజేశారు. ఎస్పీ స్వయంగా వాటిని స్వీకరించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్య పూర్వాపరాలను సమగ్రంగా తెలుసుకున్నా రు. చట్టపరంగా వాటిని పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో సమీక్షించారు. మీ కోసం కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక శ్రద్ధ వహించి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని సూచించారు. ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని, తీసుకున్న చర్యలపై నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఇక నుంచి ప్రతి సోమవారం అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలో మీ కోసం కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో కూడా యథావిధిగా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. దర్శిలో మొత్తం 69 ఫిర్యాదులు అందాయన్నారు. ఒంగోలులోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఒంగోలు డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు, సింగరాయకొండ సీఐ శ్రీహరి నిర్వహించిన మీ కోసం కార్యక్రమానికి కూడా 65 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ వెల్లడించారు.

పెండింగ్‌ కేసులపై శ్రద్ధ వహించాలి

పెండింగ్‌ కేసులపై శ్రద్ధ వహించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ హర్షవర్దన్‌రాజు పోలీసు అధికారులను ఆదేశించారు. దర్శిలో సోమవారం పోలీస్‌ మీ కోసం కార్యక్రమం అనంతరం పోలీసు అదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. దర్శి సబ్‌ డివిజన్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసులపై సమీక్షించారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా, విక్రయాలు, వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం తాగే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు, డీసీఆర్బీ సీఐ దేవప్రభాకర్‌, దర్శి సీఐ రామారావు, అద్దంకి అర్బన్‌ సీఐ సుబ్బరాజు, అద్దంకి రూరల్‌ సీఐ మల్లికార్జునరావు, చీమకుర్తి సీఐ ప్రసాద్‌, దర్శి సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఎస్సైలు పాల్గొన్నారు.

ఎస్పీ హర్షవర్దన్‌రాజు

దర్శిలో ప్రత్యేకంగా పోలీస్‌శాఖ మీ కోసం కార్యక్రమం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement