● రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు
ఒంగోలు వన్‌టౌన్: బాలల హక్కుల పరిరక్షణ, బాల కార్మికుల నిర్మూలనకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణరాజు కోరారు. కమిషన్ సభ్యుడు వి.గాంధీతో కలిసి సోమవారం ఒంగోలులో ఆయన పర్యటించారు. బాలల సంక్షేమం, రక్షణ, బాలికల హక్కుల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై ఆరా తీశారు. ఒంగోలులోని పలు స్కానింగ్ సెంటర్లను సందర్శించి గర్భస్థ శిశువుల లింగ నిర్ధారణ నిషేధించే చట్టం అమలుపై తనిఖీలు చేశారు. రికార్డుల నిర్వహణ, నిబంధనల పాటింపు వంటి అంశాలను పరిశీలించారు. ఆడ శిశువుల రక్షణకు భంగం కలిగించే ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ బాల సదన్‌ను సందర్శించిన చైర్మన్.. అక్కడి బాలల వసతి, ఆహారం, విద్య, ఆరోగ్య సేవలు, పరిశుభ్రత, భద్రత, సంరక్షణ ఏర్పాట్లను పరిశీలించారు. పిల్లలకు నాణ్యమైన సేవలు అందించడంతో పాటు ప్రేమతో కూడిన సురక్షిత వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మానవ అక్రమ రవాణా నిరోధం, పిల్లలపై లైంగిక నేరాల నివారణ, బాలల పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుపై విస్తృతంగా చర్చించారు. ప్రతి బాలుడు, ప్రతి బాలిక భద్రత, విద్య, ఆరోగ్యం, గౌరవంతో కూడిన జీవితాన్ని పొందడం అనేది సమాజం, ప్రభుత్వ ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.నాగమణి, జిల్లా బాలల సంక్షేమ సమితి సభ్యురాలు నీలిమ, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి.దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


