● సంయుక్త కిసాన్ మోర్చా నాయకుల ధ్వజం
ఒంగోలు టౌన్: పొగాకు రైతులను దెబ్బ తీసేందుకు కొందరు లాలూచీపరులతో బోర్డు అధికారులు సమావేశాల నాటకాలాడుతున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ధ్వజమెత్తారు. క్వింటా రూ.20 వేలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు ఉన్నా అవేమీ పట్టించుకోకుండా సమావేశాల పేరుతో రైతులను మోసం చేసేందుకు కుయుక్తులు పన్నుతున్న బోర్డు అధికారుల తీరు బాగాలేదని విమర్శించారు. బోర్డు అధికారుల మోసపూరిత వైఖరికి నిరసనగా ఈ నెల 24, 25, 26, 27 తేదీల్లో ప్రకాశం భవనం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎల్బీజీ భవనంలో ఆదివారం సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ రైతు సంఘాల జిల్లా నాయకులు జజ్జురి జయంతి బాబు, వీరారెడ్డి, ఎస్.లలితకుమారి, సీఎస్ సాగర్, ఎస్‌కే మాబు తదితరులు మాట్లాడారు. జిల్లాలో ఎక్కడా పొగాకు క్వింటా రూ.20 వేలకు కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. నో బిడ్లలో ఎలాంటి మార్పులేదని తేల్చి చెప్పారు. దిద్దుబాటు చర్యల పేరుతో వ్యాపారులకు మరింత లాభాలు కలిగించే విధంగా , రైతుల కష్టాన్ని దోచుకునే కుట్రలో భాగంగా ప్రీ వారికేటర్స్ పేరుతో కొందరు వ్యక్తులను రంగంలోకి దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం రైతులను దగా చేసే వారికేటర్స్‌ను పక్కన పెట్టి ఎలాంటి జాప్యం లేకుండా వర్జీనియో పొగాకును కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ.1000 కోట్లు కేటాయించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించి రైతులకు భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. లేకుంటే బ్యార్నీకి రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. క్వింటా పొగాకును రూ.20 వేల కంటే తక్కువకు కొనుగోలు చేస్తే రైతులు వేలాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు.


