ఒంగోలు టౌన్: ఆమె పక్కా భారతీయురాలు. పుట్టింది యూరప్‌లో. పెరిగింది బెంగళూరు, చైన్నె, ఒంగోలులో. ఆమె పేరు గోపి తాన్య. తండ్రి గోపి వెంకట్ వృత్తిరీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నారు. తల్లి ప్రవీణలత కొంతకాలం భర్తతో పాటే అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. తర్వాత ఇండియాకు తిరిగి వచ్చి ఒంగోలులో యోగా ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. తాన్య ప్రస్తుతం చైన్నెలో ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యనభ్యసిస్తూనే విభిన్న కళల్లో రాణిస్తున్నారు. తాను చదువుతున్న కళాశాల కల్చరల్ విభాగానికి సెక్రటరీగా వ్యవహరిస్తున్న తాన్య.. వ్యాఖ్యతగా రాణిస్తున్నారు. ఒంగోలు, నెల్లూరు, చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరుగుతూ మెడిటేషన్ బోధిస్తున్నారు. హార్ట్‌ఫుల్నెస్ ధ్యానాన్ని క్రమం తప్పకుండా ఆచరిస్తూ దాని ప్రాముఖ్యతను ఇతరులకు తెలియజేస్తున్నారు.
భగవద్గీత శ్లోకాలు చెబుతూ...
ఆధునిక విద్యనభ్యసిస్తున్న తాన్య భగవద్గీతను కంఠస్తం పట్టారు. అందులోని శ్లోకాలను స్పష్టంగా చెప్పి పలువురి ప్రశంసలు పొందుతున్నారు. భగవద్గీత పఠనం ద్వారా ఆద్యాత్మిక విలువలు పెంపొందించుకోవడం గురించి వివిధ వేదికల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. స్వామీ వివేకానందుడి బోధనలకు ప్రభావితురాలైన ఆమె.. మోటివేషన్ టీచర్‌గా కూడా రాణిస్తున్నారు. చిన్నారులకు ఉపయోగపడే విధంగా ది షంట్ ఆబ్సేషన్ అనే పుస్తకాన్ని రచించారు. తాన్యకు హిందీ భాషపై మంచి పట్టు ఉంది. హిందీలో ఆధ్యాత్మిక ఆంశాలతో కూడిన గజల్స్ రచిస్తున్నారు.
కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తూ...
ప్రభుత్వ శిక్షణ సంస్థలో కూచిపూడిలో శిక్షణ పొందిన తాన్యకు భారతీయ నృత్యం అంటే ఎంతో ఇష్టం. అందుకే భారత సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో బెంగళూరు, చైన్నె, నెల్లూరు, ఒంగోలులో నృత్య ప్రదర్శనలిచ్చారు. ఒంగోలులోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల వందేళ్ల వేడుకల్లో కూడా కూచిపూడి నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందారు. ఇప్పటి వరకు దేశ విదేశాలలో 150 ప్రదర్శనలిచ్చి శభాష్ అనిపించుకున్నారు. చిన్నవయసులోనే భారతీయ సంస్కృతి గురించి ప్రచారం చేస్తున్న తాన్యను పలువురి అభినందిస్తున్నారు.
వివేకానందుడి వేషధారణలో...
నాట్యం చేస్తున్న తాన్య


