● ఆధ్యాత్మిక, వ్యాపార సేవలకు గుర్తింపుగా..
చీమకుర్తి: మాజీ మంత్రి శిద్దా రాఘవరావుకు అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన మేరీల్యాండ్ యూనివర్శిటీ వారు డాక్టరేట్ ప్రదానం చేశారు. యూనివర్శిటీ చాన్సిలర్, వైస్ చాన్సిలర్‌లు డాక్టర్ జాన్ ఎన్ కలరస్, సోఫియా సుభాని నిర్వహణలో ఉత్తమ సేవలలో ప్రతిభ కలిగిన వారిలో శిద్దా రాఘవరావును ఎంపిక చేశారు. డాక్టరేట్ అవార్డు ప్రదానోత్సవానికి శిద్దా రాఘవరావు అనివార్య కారణాల వలన అమెరికా వెళ్లలేకపోవడంతో గత 15 రోజుల క్రితం యూనివర్శిటీ ప్రతినిధుల ద్వారా ఒంగోలులోని ఆయన స్వగృహంలో అవార్డు అందించారు. ఆదివారం ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో రాఘవరావుకు వచ్చిన డాక్టరేట్ అవార్డును ప్రదర్శించారు. ఆయనను పలువురు అభినందించి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, వ్యాపార రంగాలలో చేస్తున్న విశేష సేవలకు గుర్తింపుగా మేరీల్యాండ్ యూనివర్శిటీ వారు డాక్టరేట్ అందించారని శిద్దా రాఘవరావు తెలిపారు. ఈ అవార్డు ద్వారా తాను చేస్తున్న సేవలకు గుర్తింపు దక్కడం సంతోషాన్ని కలిగించిందన్నారు.
● 51 గ్రాముల బంగారు ఆభరణాలు, నగదు చోరీ
సింగరాయకొండ: మండల కేంద్రంలోని శ్రీరాంనగర్‌కు చెందిన మల్లెల వెంకటేశ్వర్లు నివాసంలో దొంగలు చోరీకి పాల్పడి సుమారు రూ.6 లక్షల విలువైన 51 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.23 వేల నగదు చోరీ చేసినట్లు బాధితుడు వెంకటేశ్వర్లు తెలిపారు. బాధితుడి కథనం ప్రకారం తాను బేల్దారీ పనిచేసుకుని జీవిస్తానని, శనివారం స్వగ్రామమైన కందుకూరు మండలం వెంకన్నపాలేనికి భార్య ప్రమీలతో సహా వెళ్లానని తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చే సరికి తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. ఇంట్లోకి వెళ్లి చూసేసరికి బీరువాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయన్నారు. బీరువాలోని బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధీర్‌కుమార్ తెలిపారు.


