గుండ్లకమ్మ..గుండె కోత | - | Sakshi
Sakshi News home page

గుండ్లకమ్మ..గుండె కోత

Jun 22 2026 1:54 AM | Updated on Jun 22 2026 1:54 AM

ప్రశ్నించేవారిపై దౌర్జన్యాలు

మద్దిపాడు:

చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తెలుగు తమ్ముళ్లు అక్రమార్జన కోసం ఎంతకై నా తెగిస్తున్నారు. మండలంలోని గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతాన్ని చెరబట్టి సర్వనాశనం చేస్తున్నారు. గుండ్లకమ్మ నదిలో దొరికే నాణ్యమైన ఇసుక వారికి ఆదాయ వనరుగా మారింది. ముఖ్యంగా మల్లవరం, కొలచనకోట, కెల్లంపల్లి, మద్దిపాడు, రాచవారిపాలెం, ఇనమనమెళ్లూరు గ్రామాల్లో నది పరివాహక ప్రాంతం నుంచి భారీగా ఇసుక తరలిస్తూ లక్షల రూపాయలు జేబులు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇసుక అక్రమంగా తరలిస్తున్నారంటూ అధికారులకు సమాచారం ఇస్తే వారు అక్రమార్కులకు సమాచారం చేరవేసి, అక్రమ ఇసుక రవాణాదారులు అక్కడ నుంచి వెళ్లిపోయిన తరువాత సోదాలు చేయడానికి వెళుతున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇసుక అక్రమ రవాణాలో ఆరితేరిన వ్యక్తులు కొందరు అన్ని స్థాయిల్లో అధికారులతో మాట్లాడి వారికి మామూళ్లు ముట్టజెప్పి పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవలి కాలంలో కొలచనకోట వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని పోలీసు శాఖకు సమాచారం ఇచ్చినా అక్కడ ఉన్న జేసీబీలను వదిలేసి రెండు ట్రాక్టర్లు సీజ్‌ చేసి మమ అనిపించారు. జేసీబీలు సీజ్‌ చేయకపోవడానికి వాటి యజమానులు అధికార పార్టీ నాయకులు కావడం, మామూళ్లు అందడమే కారణమన్నది బహిరంగ రహస్యం.

ఇసుక రీచ్‌ అడ్డుకుని..అక్రమంగా దండుకుని..

ఇసుక రీచ్‌ను ఏర్పాటు చేయడానికి గతంలో ప్రయత్నాలు జరిగినా ఇసుక అక్రమ రవాణాదారులు పలు మార్గాల్లో అడ్డుకున్నారు. ఇసుక రీచ్‌ లేకపోవడంతో యథేచ్ఛగా ఇసుక అక్రమంగా రవాణా చేయడానికి వీలు దొరికినట్లయింది. ఇసుక దందాలో స్థానిక నాయకులతో పాటు పైస్థాయి నాయకునికి, మండల, ఉన్నత స్థాయి అధికారులకు వాటాలు అందుతుండడంతో ఎవరికి వారు తేలు కుట్టిన దొంగల్లా కిమ్మనకుండా ఉండిపోతున్నారన్నది ప్రజల అభియోగం. ఇసుకను గుండ్లకమ్మ నది నుంచి బయటకు తరలించి డంప్‌ చేసి, కావలసిన వారికి ట్రాక్టర్‌ రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకూ అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం ఇసుక అక్రమ రవాణాదారులకు సర్వసాధారణమైపోయిందని మండిపడుతున్నారు.

ఇటీవల నాలుగు రోజుల క్రితం ఇసుక అక్రమ రవాణాపై నివేదిక ఇవ్వడానికి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఇంటలిజెన్స్‌ ఏఎస్‌ఐపై కూడా దౌర్జన్యంగా మాట్లాడడం, రెవెన్యూ కింది స్థాయి అధికారులైన వీఆర్‌ఏలను ట్రాక్టర్‌లతో తొక్కిస్తామని ముందుకు ట్రాక్టర్‌పై దూసుకొచ్చిన ఘటనలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని జిల్లా స్థాయి అధికారులకు ఏఎస్‌ఐ ఫిర్యాదు చేయడం, అదేవిధంగా మండల స్థాయి అధికారులకు తెలియజేసినట్లు సమాచారం. ఇంత దౌర్జన్యంగా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని స్థానిక ప్రజలు తెలిపారు. పంచాయతీలకో, మైనింగ్‌ శాఖకో రావాల్సిన ఆదాయాలకు గుండి కొట్టి జేబులు నింపుకుంటున్నారు. గుండ్లకమ్మ నది సమీపంలో ఉండే గ్రామాల్లో వారు స్థానికంగా నిర్మాణాలు చేసుకునేందుకు ఇసుక కోసం వెళితే వారిని బెదిరించి బయటకు పంపేస్తున్నారని, తమకు చెబితే తామే తోలుతామంటున్నారని స్థానికులు కొందరు తెలిపారు. తమ గ్రామం నుంచి ఇసుక తీసుకెళ్లి వేరే మండలాల్లో అమ్ముకుంటూ ఇక్కడి వారిపై దౌర్జన్యం చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా ప్రవర్తించడంపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను నిలిపేసి స్థానికుల అవసరాలకు అనుగుణంగా ఇసుక లభ్యత కల్పించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement