ఓ వైపు జల హారతులు.. మరో వైపు అక్రమార్జనకు గోతులు చేపల కోసం రిజర్వాయర్లు, చెరువులకు పచ్చ నేతల గండ్లు రిజర్వాయర్లకు రక్షణ కరువు ఇరిగేషన్ అధికారుల తీరుపై మండిపడుతున్న రైతులు రెండేళ్లయినా.. శాశ్వత మరమ్మతులకు నిధులు విదల్చని వైనం
ఒక్క నీటి బొట్టూ వృథా కాకూడదు..జలరక్షణే బాధ్యత అంటూ.. జలధార –జలహారతి పథకానికి శ్రీకారం చుట్టారు. దీనిపై ప్రచార ఆర్భాటం తప్ప క్షేత్ర స్థాయిలో అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు టీడీపీ చోటా నేతల చేష్టలు జల సంరక్షణ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. అధికార పార్టీ అండతో చేపల కాసుల వేట కోసం... చెరువులకు గండ్లు కొడుతున్నారు. ఫలితంగా లక్షల లీటర్ల నీరు నేల పాలై వృథాగా పోతున్నాయి. అక్రమార్జనకు అలవాటు పడిన ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులు దీనిపై మౌనం దాల్చుతున్నారు.
కనిగిరిరూరల్: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక చోట్ల చేపల కోసం చెరువులను, రిజర్వాయర్‌లకు, వాగులకు గండ్లు వేసిన ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవల తూర్పు ప్రకాశంలోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా చేపల కాంట్రాక్టర్లు స్థానిక నాయకులు, అధికారుల అండతో గండ్లు కొట్టారు. గత ఏడాది జిల్లాలోనే పెద్ద రిజర్వాయర్‌లలో ఒకటైన మోపాడు రిజర్వాయర్ అలుగు వాగుకు గండి కొట్టారు. దీంతో అప్పట్లో వామపక్ష నాయకులు, రైతులు తీవ్ర ఆందోళన చేశారు. రిజర్వాయర్‌కు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, వెంటనే గండి పూడ్చాలని కలెక్టర్‌కు, జిల్లా ఇరిగేషన్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ఘటనకు కారకులు చేపల కాంట్రాక్టర్లే అని తీవ్ర ప్రచారం కూడా జరిగింది. తాజాగా కనిగిరి నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్‌కు కొందరు అక్రమార్కులు గండికొట్టారు. తూము రంధ్రానికి తొర్ర పెట్టడంతో లక్షల లీటర్ల నీళ్లు వృథా అయ్యాయి. రిజర్వాయర్‌కు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, తక్షణం శాశ్వత మరమ్మతు చర్యలు చేపట్టాలని వైఎస్సార్ సీపీ కనిగిరి ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ కలెక్టర్, ఇరిగేషన్ జిల్లా అధికారికి, ఆర్డీఓకు ఫిర్యాదు కూడా చేశారు. ఇరిగేషన్ అధికారులు తాత్కాలిక మరమ్మతు చర్యలు చేపట్టి నీటి వృథాను అరికట్టారు. కారణాలు ఏమైనా.. కారకులు ఎవరైనా.. రిజర్వాయర్‌కు గండి కొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్, రెవెన్యూ, నీటి సంఘ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ తర్వాత దానిపై ఎటువంటి చర్యలు లేవు.
అవసాన దశలో ప్రధాన రిజర్వాయర్లు..
కనిగిరి అనగానే గుర్తుకొచ్చేది నీటి సమస్య. అలాంటి కరువు ప్రాంతానికి సాగు, తాగునీటికి శాశ్వత వనరులు లేవు. ఇక్కడి ప్రజలకు వర్షాధారిత పంటలే.. వర్షపు ప్రతి నీటి బొట్టు విలువైనదే. అయితే మూడేళ్ల క్రితం వచ్చిన తుఫాను వర్షాలకు, ఇటీవల అకాల వర్షాలకు దాదాపు అన్ని ప్రధాన రిజర్వాయర్లు, చెరువుల్లో నీటి నిల్వ ఉంది. వాటి వల్ల భూగర్భ జలమట్టాలు తగ్గలేదు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం నీటి సమస్య అంతగా లేదు. అలాంటి పరిస్థితుల్లో నీటి వనరులను పూర్తిగా సంరక్షించుకోవాల్సిన అధికారులు, పాలకులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా చేపల వేట కోసం.. కాసుల కక్కుర్తి పడి ఉన్న నీటి వనరులకు గండి కొడుతున్నారు. కనిగిరి నియోజకవర్గంలోని 135 పంచాయతీల్లో సుమారు 132 రిజర్వాయర్లు, చెరువులు ఉన్నాయి. వీటిలో ప్రధాన రిజర్వాయర్లు అయిన మోపాడు, మాకేరు వాగు, పందువ గండి, నేలటూరి గొల్లపల్లి, పునుగోడు రిజర్వాయర్లలో ప్రస్తుతం సంవృద్ధిగా నీళ్లున్నాయి. అయితే వీటన్నింటికీ తూములు, షట్టర్లు, కట్టలు దెబ్బతిని తాత్కాలిక మరమ్మతులతో ఉన్నాయి. తుఫాను లాంటి వర్షాలు వచ్చినప్పుడు హడావుడి చేసే అధికారులు, పాలకులు, ఆ తర్వాత పట్టించుకునే పరిస్థితి లేదు. కారణాలు ఏమైనా.. గత రెండేళ్లుగా శాశ్వత మరమ్మతులు జరిగిన దాఖలాలు లేవు.
కనీస రక్షణ ఏదీ..
రిజర్వాయర్లకు గండ్లు అధికారులకు తెలిసే జరుగుతున్నాయా..? అనే అనుమానాలు రైతుల్లో, ప్రజల్లో రేకెత్తుతున్నాయి. కనీసం ప్రధాన రిజర్వాయర్ల వద్ద కూడా వాచ్‌మెన్‌లు లేరు. ప్రస్తుతం ప్రభుత్వం, అధికారులు, నీటి రక్షణకు ప్రథమ ప్రాధాన్యత అంటున్నారు. మరి అలాంటప్పుడు చెరువులకు గండ్లు కొడుతుంటే.. నీటి వనరుల పట్ల ఇరిగేషన్ అధికారులు ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం లేదో అర్థం కావడం లేదు. ఇటీవల జిల్లాలో, కనిగిరి నియోజకవర్గంలో జరిగిన చెరువులకు గండ్లు వేసిన ఘటనలు ఇరిగేషన్ అధికారుల నిజాయితీని ప్రశ్నిస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల తీరుపై ప్రజల్లో, రైతుల్లో తీవ్ర అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికై నా ప్రధాన నీటి వనరుల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారుల పై ఉంది.
ఇరిగేషన్ ఏఈ ఏమంటున్నారంటే..
దీనిపై కనిగిరి ఇరిగేషన్ ఏఈ మధుబాబును వివరణ అడగ్గా.. ‘‘నేలటూరి గొల్లపల్లి రిజర్వాయర్ తూముకు గండికొట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. ప్రస్తుతం నీటి వృథాను అరికట్టాం. నీరు బయటకుపోవడం లేదు. రిజర్వాయర్ల శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వానికి నివేదిక పంపాం. కనిగిరి పెద్దచెరువు అభివృద్ధికి రూ.40 లక్షలతో, పునుగోడు రిజర్వాయర్‌కు రూ.45 లక్షలతో, ఎన్ గొల్లపల్లి రిజర్వాయర్‌కు రూ.50 లక్షలతో మరమ్మతులు, అభివృద్ధి పనులకు నివేదికలు పంపాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం’’ అని చెప్పారు.


