బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి డబుల్ ఓట్లను గుర్తించాలి, వైఎస్సార్ సీపీ వర్గీయుల ఓట్లు తొలగించకుండా జాగ్రత్త పడాలి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్
యర్రగొండపాలెం: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్ సీపీ వర్గీయుల ఓట్లు గల్లంతు కావడం ఖాయమని, గ్రామాల్లో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మండల బీఎల్‌ఏల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఎన్నికల్లో నేరుగా గెలిచే పరిస్థితిలేదని, ఆయన వెన్నుపోటులతోనే అధికారంలోకి వస్తుంటారన్నారు. తిరిగి అధికారంలోకి రావటానికి తమ ఓట్లు గల్లంతు చేస్తారన్న విషయాన్ని గమనించాలని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్సార్ సీపీ వర్గీయుల ఓట్లు తీసివేసే ప్రక్రియ కచ్చితంగా సాగుతుందన్నారు. ఇటీవల రెండు సంవత్సరాల వెన్నుపోటు కార్యక్రమానికి ప్రజలు హాజరు కాలేదని, యర్రగొండపాలెంలో జరిగిన విజయోత్సవానికి కేవలం వందమంది మాత్రమే పాల్గొన్నారని అన్నారు. దీనినిబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎంత బలంగా పెరుగుతోందో చెప్పవచ్చన్నారు. రాష్ట్రంలో అలజడి సృష్టించి తమపై ఉన్న వ్యతిరేకతను తప్పుదోవ పట్టించడమే చంద్రబాబు ఎత్తుగడ అన్నారు. బీఎల్‌ఏ పెద్ద బాధ్యత తీసుకున్న వ్యక్తని, కూటమి నాయకులు మూడు పార్టీల నుంచి ముగ్గురు బీఎల్‌ఏలను పెట్టుకుంటారని, గ్రామంలోకి బీఎల్‌ఓ వస్తుంటే ఆ రోజు తమ సమయాన్ని వెచ్చించి ఆయనతోపాటే ఉండాలని సూచించారు. ఓడిపోవటానికి, గెలవటానికి ఒక్క ఓటు చాలని, అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వారు ఒక్క ఓటుతోనే ఓడిపోయిన వారున్నారని, ఆ ఒక్క ఓటేకదా అని ఆలోచిస్తే దెబ్బతగిలేది ఎమ్మెల్యేకే కాదని మొదటి సారి గ్రామాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర అలజడి సృష్టిస్తుందని అన్నారు. ఆయా బూత్‌లలో డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి... మరణించినవారు ఎంతమంది ఉన్నారు. వైఎస్సార్ సీపీకి సంబంధించి కొత్తగా చేరాల్సినవారు ఎంతమంది ఉన్నారు. ఈ గణాంకాలను తీసుకోవాలన్నారు. వాళ్లకు కావలసిన ఓట్లు అదనంగా ఉంచుకుంటారని, వద్దనుకునే ఓట్లు తీసివేయిస్తారని, ఈ ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రల్లో విజయవంతంగా చేయగలిగారన్నారు. వైఎస్సార్ సీపీకి చెందిన వారి ఓట్లు తొలగింపచేయకుండా, డబుల్ ఓట్లు ఎంట్రీ కాకుండా చూడాల్సిన పెద్ద బాధ్యత తమపై ఉందన్నారు. సదస్సుకు పార్టీ మండల అధ్యక్షుడు ఏకుల ముసలారెడ్డి అధ్యక్షత వహించగా ఎస్‌ఐఆర్ పార్టీ టాస్క్‌ఫోర్స్ జిల్లా సభ్యుడు పత్తి రవిచంద్ర, నియోజకవర్గ బూత్ కమిటీ అధ్యక్షుడు ఒంగోలు సుబ్బారెడ్డి బీఎల్‌ఏలకు అవగాహన పరిచారు. కార్యక్రమంలో వివిధ విభాగాల నాయకులు కె.ఓబులరెడ్డి, కందూరి కాశీవిశ్వనాథ్, వై.వెంకటేశ్వరరెడ్డి, సూరె వెంకట రమేష్, షేక్.కాశింపీరా, పబ్బిశెట్టి శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్‌కుమార్, పి.రాములు నాయక్, సింగా ప్రసాద్, ఆర్.అరుణాబాయి, పల్లె సరళ, యక్కలి రాంబాబు పాల్గొన్నారు.


