కంభం: యోగాంధ్ర–2026 కార్యక్రమాలు విజయవంతం చేసేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. అధికారులు నిర్వహించే యోగా కార్యక్రమాలకు ప్రజల్లో ఆదరణ కరువవడంతో జనసమీకరణ కోసం అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. గతేడాది యోగా కార్యక్రమాలు నిర్వహించిన అధికారులు చనిపోయిన వారికి, వృద్దులకు సైతం సర్టిఫికెట్లు మంజూరు చేయడం పలు విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన యోగా కార్యక్రమాలను విజయవంతం చేయడం కోసం కూడా వారు శ్రమించాల్సి వచ్చింది. ఆదివారం మార్కాపురం జిల్లా కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన యోగా డే కార్యక్రమాల్లో అధికారులు, ప్రజల కంటే డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలే ఎక్కువగా ఉండటం విశేషం. ఎక్కువశాతం ఉపాధి కూలీలు, డ్వాక్రా మహిళలుండగా కొందరు విద్యార్థులు, ఉద్యోగులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి రోజు కూలిపనులు చేసుకునే తమకు ఈ యోగా పాట్లేంటని ఉపాధి కూలీలు తలలు పట్టుకుంటున్నారు. ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు హుకుం జారీ చేయడంతో తప్పని సరిపరిస్థితుల్లో వృద్దులు సైతం వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉపాధి సిబ్బంది అక్కడికి హాజరైన వారి పేర్లు నమోదు చేసుకుంటూ కనిపించారు. తమకు కూలీ డబ్బులు వేస్తామని చెప్పారని మరి వేస్తారో లేదో తెలియడం లేదని అక్కడికి వచ్చిన ఉపాధి కూలీలు చెప్పుకుంటున్నారు. 60–70 ఏళ్ల వయస్సులో మాకేంటి ఈ పాట్లను పలువురు వృద్ద మహిళలు వాపోతున్నారు.


