పోలీసులపై కేసు నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పోలీసులపై కేసు నమోదు చేయాలి

Jun 22 2026 1:48 AM | Updated on Jun 22 2026 1:48 AM

ఒంగోలు వన్‌టౌన్‌: విజయవాడలో కృష్ణలంక సీఐ, పోలీసుల వేధింపులతో బలవన్మరణం చెందిన పెరిపోగు క్రాంతిమాదిగ సంఘటనకు సంబంధించి పోలీసులపై కేసు నమోదు చేయాలని, అతని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్‌ చేశారు. ఒంగోలులోని సమితి కార్యాలయం వద్ద ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ క్రాంతి మాదిగ ఆత్మహత్యకు పోలీసుల వేధింపులే కారణమని ఆరోపించారు. దానిపై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే హోంమంత్రి అనిత, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌ మౌనం వహించారని అన్నారు. కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. రాష్ట్రంలోని ఎస్సీల రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌గా చంద్రబాబు నియమించిన మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ తన సొంత మాదిగ సామాజిక వర్గానికి చెందిన క్రాంతి కుమార్‌ మాదిగ బలవన్మరణం కేసులో కనిపించకుండా పోయారన్నారు. రాష్ట్ర హోం మంత్రి అనిత ప్రతిపక్షాలను విమర్శించడానికి రాష్ట్రంలోని మంత్రులందరి కంటే ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. చంద్రయ్య మాదిగ ఇంటికి వెళ్లి డప్పు కొట్టిన మాదిగ పక్షపాతి చంద్రబాబు.. టీడీపీ మద్దతుదారుడు, ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పెరిపోగు వెంకటేశ్వరరావు కొడుకు క్రాంతికుమార్‌ మాదిగ పోలీస్‌ వేధింపులతో బలవన్మరణం చెందితే వారింటికి ఎందుకు వెళ్లలేదన్నారు. అదే కృష్ణలంక పోలీస్‌ స్టేషన్లో సీఐ నాగరాజు, పోలీసుల హింసతో శవం కూడా కనిపించని కాపు కులానికి చెందిన సాయి కృష్ణ కుటుంబ సభ్యులను తన ఇంటికి పిలిపించి ఓదార్చిన ముఖ్యమంత్రి.. మాదిగలను మాత్రం పరామర్శించలేదన్నారు. తెనాలిలో రౌడీ షీటర్ల పేరుతో ముగ్గురు మాల యువకులకు నడిరోడ్డుపై ముగ్గురు సీఐలు అరికాళ్ల కోటింగ్‌ ఇస్తే.. పోలీసులు కొడితే తప్పేమిటి అన్న రాజ్యాంగ నిపుణురాలు హోం మంత్రి అనిత.. విజయవాడలో జరిగిన కాపు యువకుడు సాయి కృష్ణ, క్రాంతి కుమార్‌ మాదిగ పోలీస్‌ హత్యలపై కూడా పోలీసులు చంపితే తప్పేమిటని అంటారేమోనని సందేహంగా ఉందని నీలం నాగేంద్రరావు ఎద్దేవా చేశారు. మాదిగ కుల ప్రతినిధిగా ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ పదవిలో ఉన్న మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో ఉన్నప్పటికీ.. సాటి మాదిగ ఉద్యమకారుడు, టీడీపీ సానుభూతిపరుడు, పోలీస్‌ హింసతో బలవన్మరణం చెందిన క్రాంతి మాదిగ తండ్రి పెరిపోగు వెంకటేశ్వరరావును ఎందుకు పరామర్శించలేదన్నారు. హోం మంత్రి అనిత, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ జవహర్‌ తక్షణమే మాదిగ జాతికి క్షమాపణ చెప్పాలన్నారు. క్రాంతికుమార్‌ శవానికి పోస్టుమార్టం చేయించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ ప్రకారం విజయవాడ పోలీసు అధికారులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దారా అంజయ్య, కాకుమాను రవి, సామాజిక ఉద్యమ నాయకులు పాలేటి కోటేశ్వరరావు, బొమ్మల వంశీ, మాల సభ కన్వీనర్‌ మేడికొండ మురళి తదితరులు పాల్గొన్నారు.

క్రాంతి మాదిగ బలవన్మరణంపై హోం మంత్రి, ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ స్పందించాలి

దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు డిమాండ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement