చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు స్థోమత లేకపోయినా పిల్లలకు మంచి చదువు దక్కుతుందన్న ఆశతో ప్రైవేటు పాఠశాలల్లో చేర్చుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల దోపిడీకి తెరతీశాయి. వేలాది రూపాయల ఫీజులకు తోడు యూనిఫాం, బుక్స్, యాక్టివిటీ ఫీజుల పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నాయి. కరువు కాలంలో పనులు లేక అల్లాడుతున్న తల్లిదండ్రులకు ఈ ఫీజుల దోపిడీ మరింత పెనుభారంగా మారింది. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమవడంతో ప్రైవేటు స్కూళ్ల దోపిడీకి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
విద్యాశాఖ మంత్రి ఫీజుల వివరాలను ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో బహిరంగంగా ప్రదర్శించాలని ప్రకటించినా క్షేత్ర స్థాయిలో ఆ ఆదేశాలు అమలు కావడం లేదు. అనేక ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికీ అధిక ఫీజులు వసూలు చేస్తూ, పుస్తకాలు, విద్యాసామగ్రిని పాఠశాలల్లోనే విక్రయిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులపై ఆర్ధిక భారం పెరుగుతోంది. సంబంధిత అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారంగా మార్చకుండా చూడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ విద్యా సంవత్సరంలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్ధుల స్కూల్ ఫీజులను తమకు ఇష్టం వచ్చినట్టుగా భారీగా పెంచాయి. ప్రతి ఏడాది స్కూల్ ఫీజులు పెంచడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో స్కూల్ బుక్కులు, యూనిఫాంలు కూడా వారివద్దనే కొనాలనే నిబంధన పెట్టారు. ప్రైవేటు పాఠశాలలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. విద్యాశాఖ అధికారులు ప్రైవేటు విద్యాసంస్ధలను తనిఖీ చేసి పెంచిన ఫీజులు తగ్గించడంతోపాటు స్కూల్ పుస్తకాలు, యూనిఫాంను తమకు ఇష్టమైన చోట కొనుగోలు చేసుకునే అవకాశం ఇవ్వాలి. దీంతోపాటు ప్రైవేటు టీచర్లకు కూడా కనీస వేతనాలను అమలు చేయాలి.
– విజయ్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి
ఒంగోలు సిటీ/మార్కాపురం:
విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల భారం విద్యార్థుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలు పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నా, ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూనే ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకంటే దీటుగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు ఉచితంగా యూనిఫాంలు, షూలు, టై, బెల్టులు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు ఇచ్చేవారు. ఫీజు రెగ్యులేటరీ కమిటీని ఏర్పాటు చేసి ప్రైవేటు పాఠశాలలపై నిఘా పెట్టేవారు. దీంతో తమ పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్య లభిస్తుందన్న ఆశతో అప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ఉన్న పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులపైనా నియంత్రణ ఉండేది.
నేడు ఇలా..
చంద్రబాబు ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైంది. రెండేళ్లుగా నాడు–నేడు పథకం కింద అసంపూర్తిగా మిగిలిన పాఠశాలలను కూటమి ప్రభుత్వం పట్టించుకోలేదు. విద్యార్థులు అరకొర వసతుల మధ్య ప్రభుత్వ పాఠశాలల్లో చదువు కొనసాగిస్తున్నారు. దీంతో తమ పిల్లలకు మెరుగైన విద్య దక్కుతుందన్న ఆశతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల దోపిడీతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
రూ.30 వేల నుంచి రూ.లక్ష వరకు..
ఒకటో తరగతి విద్యార్థికే రూ.30 వేలకు పైన, పదో తరగతి విద్యార్థికి రూ.70 వేల నుంచి లక్ష రూపాయిల వరకు వసూలు చేస్తున్న పాఠశాలలు చాలా ఉన్నాయి. గత ఏడాది మూడో తరగతికి రూ.40 వేలు ఉంటే ఈ సంవత్సరం ఫీజు రూ.50 వేలుకు అంటే రూ.10 వేలు పెంచుతున్నారు. ఒక్కో తరగతికి రూ.10 వేలు చొప్పున పెంచుతున్నారు. ప్రకాశం జిల్లాలో 443 ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, మార్కాపురం జిల్లాలో 230 ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అడ్మిషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫాంలు, రవాణా ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.
వారి దగ్గరే యూనిఫాం, బుక్స్ కొనాలి..
నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు సుమారు రూ.10 నుంచి రూ.15 వేలు పుస్తకాలకు, మరో రూ.5 వేలు యూనిఫాం కింద తల్లిదండ్రుల వద్ద నుంచి వసూలు చేస్తున్నారు. దీంట్లోనే 50 శాతం మేర ఆదాయం వస్తోంది. మరికొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, తమ స్కూల్‌డ్రస్, పుస్తకాలను షాపులకు కాంట్రాక్టు ఇవ్వడంతో ఆయా స్కూల్స్ యూనిఫారాలు అక్కడ మాత్రమే దొరుకుతున్నాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ షాపుల్లోనే వారు చెప్పిన ధరకే అవి ధరకు తగ్గ నాణ్యత లేకపోయినా కొనాల్సి వస్తోంది. ప్రైవేటు పాఠశాలలకు పుస్తకాలు, స్టేషనరీతో అదనపు ఆదాయం వస్తోంది. జూనియర్ కళాశాలల్లో కూడా ఇదే తంతు కొనసాగుతోంది. జిల్లా మొత్తం మీద సుమారు 130 జూనియర్ కళాశాలలు ఉండగా ఇందులో సుమారు 60 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. లక్షల రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు.
ఫీజుల నియంత్రణ ఎక్కడ?
ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల పెంపుపై పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అధిక ఫీజులపై ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించడం లేదని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చినా వాటి అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. జిల్లా స్థాయి అధికారులు ఫీజుల నిర్మాణం, అదనపు వసూళ్లు, మెస్ చార్జీలు, ప్రత్యేక కోర్సుల పేరుతో జరుగుతున్న దోపిడీ పై సమగ్రంగా పరిశీలించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలల ఫీజులపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలి. మెస్ ఛార్జీలు, అదనపు వసూళ్లపై పారదర్శకత తీసుకురావాలి.
ఫీజుల నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలి:
ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని, ప్రతి పాఠశాల ఫీజు వివరాలను బహిరంగంగా ప్రకటించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యను వ్యాపారంగా కాకుండా సేవగా చూడాలని, అధిక ఫీజులపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. స్కూళ్ల దోపిడీపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
– వినోద్, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జిల్లా కార్యదర్శి


