పొగాకు రైతుల కోసం ధర్నాకు సిద్ధం | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుల కోసం ధర్నాకు సిద్ధం

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున

మద్దిపాడు: జిల్లాలోని పొగాకు రైతులకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జిల్లా కేంద్రంలో ధర్నాలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని, వారిని ప్రభుత్వం ఆదుకోకుండా మీన మేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. సుమారుగా ఎకరాకు దున్నకాలు, నారు, నాట్లు కూలి ఖర్చులు పొగాకు కాల్చడం, రవాణా ఇలా అన్ని ఖర్చులు కలుపుకుని సుమారు రూ.2 లక్షల వరకూ అవుతుందని, దీనికి తోడు మధ్యలో వర్షం పడి పొగాకు పంట పోతే మళ్లీ నాట్లు వేస్తారని, దీనికి అదనంగా మరో రూ.20 వేల వరకూ ఖర్చు వస్తుందన్నారు. ఒక బ్యారన్‌ వేసే రైతుకు రూ.20 లక్షల వరకూ ఖర్చు వస్తుందన్నారు. రైతు 80 క్వింటాళ్ల పొగాకు పండిస్తే అందులో సుమారు 50 శాతం మేలిమి రకం పొగాకు దిగుబడి అవుతుందని, మిగిలిన 50 శాతం బ్రౌన్‌, గ్రీన్‌ టాప్‌లీఫ్‌, మాడు వస్తాయని పొగాకు మొత్తాన్ని సరాసరిన కేజీ రూ.250 పైన కొనుగోలు చేస్తే రైతు అప్పులేకుండా బయపడతాడన్నారు. కానీ వ్యాపారులు మాత్రం మేలిమి రకం పొగాకునే రూ.170 నుంచి రూ.200 లోపు కొనుగోలు చేస్తున్నారన్నారు. మేలిమి రకం పొగాకునే ఇంత తక్కువ ధరకు కొనుగోలు చేస్తే మిగిలిన 50 శాతం ఎఫ్‌ 5 రకం పొగాకును వీరు ఎంతకు కొనుగోలు చేస్తారో ఊహించవచ్చన్నారు. పొగాకు కొనుగోళ్లు ఇలాగే సాగితే బ్యారన్‌కు రూ.4.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ నష్టం వాటిల్లుతుందని ఆయన వివరించారు. ఇలా కొనుగోలు చేయడం వలన పొగాకు రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొగాకు రైతులను ఆదుకోవడానికి రూ.300 కోట్లతో మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దింపి కొనుగోలు చేయించారని గుర్తు చేశారు. చంద్రబాబుకు రైతులన్నా, వ్యవసాయమన్నా చులకన భావం ఉందని, అందుకే వారికి రైతులకు సహాయం చేద్దామన్న ఆలోచన ఉండదని విమర్శించారు. చంద్రబాబు కేజీ రూ.200లకు తగ్గకుండా కొనుగోలు చేయమని చెబుతున్నారని కానీ వేలం కేంద్రాల్లో ముఖ్యమంత్రి చెప్పినట్లు కొనుగోళ్లు జరగడం లేదన్నారు. కార్పొరేట్లకు దోచి పెట్టడమే పరమావధిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని ఆయన విమర్శించారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు కొనుగోలు చేయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రైతులను విస్మరించిన ఏ ప్రభుత్వం మనలేదన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే అన్ని పార్టీలు ప్రజా సంఘాలను కలుపుకుని ధర్నా చేయడానికి కూడా వెనుకాడమని మేరుగు నాగార్జున హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement