లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్ట్‌

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

పర్చూరు (చినగంజాం): మహిళపై లైంగికదాడికి పాల్పడిన కేసులో మైనర్‌ అయిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పర్చూరు పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో మార్టూరు రూరల్‌ సీఐ నాగభూషణం శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన సుమారు 36 ఏళ్ల యువతి తన భర్తతో కలిసి పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో నివసిస్తోంది. ప్రతిరోజూ చిలకలూరిపేట పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో కూలి పనుల కోసం ఆమె వెళ్తుంటుంది. ఈ క్రమంలో ఈ నెల 15వ తేదీ ఉద యం 8 గంటల ప్రాంతంలో ఎప్పటిలాగానే కూలి పనుల కోసం చిలకలూరిపేట గాంధీ పార్కు వద్ద ఎదురుచూస్తోంది. ఆ సమయంలో గుర్తు తెలియని యువకుడు ఆమె దగ్గరకు వచ్చి మార్టూరులోని ఒక అపార్ట్‌మెంట్‌లో శుభ్రం చేయడానికి ఆడమనిషి కావాలని చెప్పి తన మోటారు సైకిల్‌పై ఎక్కించుకున్నాడు. ఒంగోలు వైపు వెళుతూ మార్గం మధ్యలో తాతపూడి ఫ్లైఓవర్‌ జంక్షన్‌ వద్ద నుంచి సూరావారిపల్లె వెళ్లే రోడ్డులోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను కొట్టి కింద పడేసి లైంగిక దాడి చేశాడు. అనంతరం ఆమె సెల్‌ఫోన్‌ లాక్కుని అక్కడి నుంచి మోటార్‌ సైకిల్‌పై పరారయ్యాడు. ఆ మహిళ ఆ విషయాన్ని తనకు తెలిసిన వ్యక్తికి చెప్పి అదే రోజు రాత్రి యద్దనపూడి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఒంగోలులో బైక్‌ చోరీ చేసి వస్తుండగా అదుపులోకి...

సీఐ నాగభూషణం శనివారం ఉదయం తన సిబ్బందితో పర్చూరులోని వై జంక్షన్‌ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, లైంగిక దాడి కేసులోని నిందితుడు గతంలో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద దొంగతనం చేసిన మోటార్‌ సైకిల్‌పై ఒంగోలు వైపు నుంచి గుంటూరు వైపు వెళ్తూ పోలీసులను చూసి వాహనాన్ని వెనక్కు తిప్పి పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో అతన్ని పోలీసులు పట్టుకుని విచారించారు. సదరు యువకుడు బాపట్ల జిల్లా చుండూరు మండలం మోదుకూరు గ్రామానికి చెందిన మైనర్‌ కాగా, ప్రస్తుతం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెద్దపరిమి గ్రామంలో ఉంటున్నట్లు గుర్తించారు. అతడు పోలీసుల విచారణలో నేరాలు అంగీకరించడంతో అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బాధితురాలి సెల్‌ ఫోన్‌, మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతనిపై పలు క్రిమినల్‌ కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. విలేకరుల సమావేశంలో పర్చూరు ఎస్‌ఐ పులిగోపి, యద్దనపూడి ఎస్‌ఐ డీ వెంకటరత్నం, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement