నల్లమల నిండా.. ప్లాస్టిక్‌ వ్యర్థాలే! | - | Sakshi
Sakshi News home page

నల్లమల నిండా.. ప్లాస్టిక్‌ వ్యర్థాలే!

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

పెద్దదోర్నాల: ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా నిన్నమొన్నటి వరకు కళకళలాడిన నల్లమల అభయారణ్యం ఇప్పుడు కళావిహీనంగా మారింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలు, తినుబండారాల కవర్లు, తదితర వాటితో ప్రస్తుతం నల్లమల అభయారణ్యంలోని రహదారులు నిండిపోయాయి. ఒకప్పుడు ప్లాస్టిక్‌ బాటిళ్లను రోడ్లపై పడేస్తే జరిమానాలు విధిస్తూ యాత్రికులకు ముచ్చెమటలు పట్టించిన అటవీ శాఖ ఉన్నతాధికారులు ఇప్పుడు ఆ సంగతే మరిచారు. దీంతో పాటు గణపతి చెక్‌పోస్టు వద్ద శ్రీశైలం వెళ్లే పర్యాటకుల నుంచి నీటి బాటిళ్లను బలవంతంగా తీసుకున్న అధికారులు.. నేడు ఆ నిబంధనలను గాలికి వదిలేశారు. ప్రయాణికులు, యాత్రికులు పారవేసే ప్లాస్టిక్‌ నీటి బాటిళ్లు, రేపర్లలో ప్యాక్‌ చేసిన తినుబండారాల ప్యాకెట్లను ఏరేసే స్వచ్ఛ సేవక్‌లకు 15 రోజులుగా ఇతర పనులు అప్పగించి చోద్యం చూస్తున్నారు. దీంతో అటవీ ప్రాంతంలోని రహదారులు ప్లాస్టిక్‌ వ్యర్థాలు, రేపర్లలో ప్యాక్‌ చేసిన తినుబండారాల ప్యాకెట్లతో పూర్తిస్థాయిలో నిండి శ్రీశైలం వెళ్లే యాత్రికులకు చికాకు కలిగిస్తున్నాయి.

సీడ్‌బాల్స్‌ తయారీలో స్వచ్ఛ సేవక్‌లు...

నల్లమల అభయారణ్యంలో విధులు నిర్వహించే స్వచ్ఛ సేవక్‌లు గత నెల 3వ తేదీ నుంచి వారి విధులకు హాజరు కాకుండా ఉన్నతాధికారుల అదేశాల మేరకు సీడ్‌బాల్స్‌ తయారీ పనుల్లో బిజీగా మారారు. సీడ్‌బాల్స్‌ తయారీ మంచి కార్యక్రమమే అయినప్పటికీ స్వచ్ఛ సేవక్‌లు 15 రోజులుగా విధులకు హాజరుకాకపోవడంతో రోడ్లకు ఇరువైపులా ప్లాస్టిక్‌ బాటిళ్లు వేలాదిగా పేరుకుపోవడంతో నల్లమలలోని వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు. సాధారణంగా సీడ్‌బాల్స్‌ తయారీని స్వచ్ఛంద సంస్థలు లేదా ప్రత్యేకంగా ఏర్పాటు చేసి న కూలీల ద్వారా చేయించాల్సి ఉంది. నిరంతరం రోడ్లపై చెత్త, ప్లాస్టిక్‌ను ఏరివేసే స్వచ్ఛ సేవక్‌లను సీడ్‌బాల్స్‌ తయారీకి వినియోగించటం ఎంత వరకు సబబని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.

వన్యప్రాణులకు ప్రాణహాని...

శ్రీశైలం వచ్చే భక్తులు, యాత్రికులు సాధారణంగా మార్గమధ్యంలో భోజనం, అల్పాహారాలు చేయడంతో పాటు నీటి బాటిళ్లు, ప్లాస్టిక్‌ రేపర్లలో ప్యాక్‌ చేసిన తినుబండారాలను కొనుగోలు చేస్తుంటారు. అలా కొనుగోలు చేసిన ఆహార పదార్థాల వ్యర్థాలను, ప్లాస్టిక్‌ కవర్లను, నీటి బాటిళ్లను మార్గమధ్యంలో అభయారణ్యంలోని రోడ్లపై విసిరేస్తుంటారు. అలా సగం తిని వదిలేసిన తినుబండారాలను నల్లమలలో సంచరించే మూగజీవాలు తింటాయి. అవి వ్యర్థాలను తినటంతో మూగజీవాల జీర్ణవ్యవస్థలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకొని వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అటవీశాఖ ఉన్నతాధికారులు అభయారణ్యంలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

స్వచ్ఛ సేవక్‌లకు ఇతర పనులు

అప్పగించిన అధికారులు

శ్రీశైలం మార్గం పొడవునా పేరుకున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలు

ప్లాస్టిక్‌ వ్యర్థాలను తిన్న మూగజీవాల్లో జీర్ణకోశ వ్యాధులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement