జిల్లాలో పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో పెరిగిన పోలింగ్‌ కేంద్రాలు

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ మాధురీలత సమావేశం

ఒంగోలు సబర్బన్‌:

జిల్లాలో ప్రస్తుతం పోలింగ్‌ కేంద్రాలు పెరిగాయని జిల్లా ఇన్‌చార్జ్‌ డీఆర్‌ఓ మాధురీలత వెల్లడించారు. స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ జిల్లాలో 1649 పోలింగ్‌ స్టేషన్లు కాస్తా 1725 పోలింగ్‌ స్టేషన్లకు పెరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 76 పెరిగాయన్నారు. ఒంగోలు నియోజకవర్గంలో 259 నుంచి 271కి.. అనగా 12 పోలింగ్‌ స్టేషన్లు పెరిగాయన్నారు. ఓటు నమోదు చేసుకునేటప్పుడు రెండు పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, బీఎల్‌వోలు అడిగిన నమోదు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు దామరాజు క్రాంతికుమార్‌ మాట్లాడుతూ జిల్లాలో, ఒంగోలు నగరంలో డోర్‌ నంబర్లు కొన్ని చోట్ల వెయ్యలేదని, సర్‌ కార్యక్రమం ఏ విధంగా చేస్తున్నారని ప్రశ్నించారు. సర్‌ కార్యక్రమంలో అధికార పార్టీ వారి ప్రలోభాలకు లొంగి నిజమైన ఓటర్లను తొలగిస్తే ఆ ఓటరు భారతదేశ పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఓటరును 2 ఫొటోలు అడుగుతున్నారని, ప్రతి ఓటరు తమ ఫొటోలు ఫొటో స్టూడియోకెళ్లి తీయించుకొని ఇవ్వాలంటే రూ.300 ఖర్చవుతుందని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి రూ.300 చొప్పున చెల్లించి అందరూ ఫొటోలు తీయించుకునే పరిస్థితి లేదని డీఆర్‌ఓ దృష్టికి తీసుకెళ్లారు. ఈ భారాన్ని ఓటరు భరించే పరిస్థితి లేనందున ఎన్నికల సంఘం ఫొటోగ్రాఫర్‌ను పెట్టి ఫొటోలు తీసే కార్యక్రమం చేపట్టాలని కోరారు. ఒక కుటుంబంలో చనిపోయిన వారుంటే వారి ఓటు తొలగించడానికి డెత్‌ సర్టిఫికెట్‌ అడుగుతున్నారని, ప్రస్తుతం ఒక డెత్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకోవాలంటే ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల లంచం ఇవ్వందే వచ్చే పరిస్థితి లేదని అన్నారు. డెత్‌ సర్టిఫికెట్‌ లేకుండానే చనిపోయిన వారి ఓట్లను తొలగించే ఏర్పాట్లు చేయాలని క్రాంతికుమార్‌ కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement