పొగాకు రైతు పోరుబాట | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతు పోరుబాట

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

గిట్టుబాటు ధరల కోసం రోడ్డెక్కిన రైతులు వందలాది ట్రాక్టర్లు, మోటారు బైకులతో భారీ నిరసన ర్యాలీ అడుగడుగునా ప్రజా సంఘాల సంఘీభావం చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించిన రైతు నాయకులు గిట్టుబాటు ధర లభించే వరకు పోరాటం కొనసాగిస్తామన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

ఒంగోలు టౌన్‌: పొగాకు రైతుల నినాదాలతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. వందలాది మంది రైతులు ఉదయం 9 గంటల నుంచే నగరానికి చేరుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, పొగాకు కొనుగోలుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెయ్యి కోట్ల రుపాయలు కేటాయించి ఆదుకోవాలని రైతులు పెద్దపెట్టున నినదించారు. జిల్లా వ్యాప్తంగా తరలి వచ్చిన రైతులు నిర్వహించిన ట్రాక్టర్ల ర్యాలీలో సుమారు 500 వరకు ట్రాక్టర్లు పాల్గొన్నాయి. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీకి సీపీఐ, సీపీఎం, సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు మద్దతు ప్రకటించడమే కాకుండా నేరుగా ర్యాలీలో పాల్గొన్నారు. నగరంలోని టొబాకో బోర్డుకు సమీపంలోని మినీ స్టేడియం నుంచి బయలుదేరిన ర్యాలీ మండుటెండను సైతం లెక్కచేయకుండా ముందుకు సాగింది. ప్రకాశం భవన్‌, అద్దంకి బస్టాండ్‌, ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌, కర్నూలు రోడ్డు మీదుగా ఒంగోలు బైపాస్‌ వరకు ర్యాలీ జరిగింది.

రైతు నాయకులను ఢిల్లీకి పిలుచుకోవాలి: గుజ్జుల ఈశ్వరయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

పొగాకు గిట్టుబాటు ధరల కోసం రైతు సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు కేంద్రానికి లేఖలు రాస్తూనే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి లేఖలు రాయడం వలన ఉపయోగం ఉండదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. రాష్ట్రానికి చెందిన పొగాకు రైతులను, సంయుక్త కిసాన్‌ మోర్చా నాయకులను, కౌలు రైతు సంఘాల నాయకులను నేరుగా కేంద్ర ప్రభుత్వం వద్దకు పిలుచుకొని వెళితే ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నారు. పొగాకు పంట వలన ఏడాదికి లక్ష కోట్ల రూపాయలకు పైగా విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న కేంద్ర ప్రభుత్వం కేవలం వేయి కోట్లు కేటాయించలేని దుస్థితిలో ఉందంటే నమ్మశక్యంగా లేదని చెప్పారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్పిన మాటలు ఏమై పోయాయో చెప్పాలని ప్రశ్నించారు. టుబాకో బోర్డు, కంపెనీలు సిండికేట్‌గా తయారై పొగాకు రైతులను నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

కంపెనీ కోరల్లో పొగాకు రైతులు విలవిల: చిట్టిపాటి వెంకటేశ్వర్లు, అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పొగాకు ఽకొనుగోలు విషయంలో కంపెనీలు సిండికేట్‌గా తయారయ్యాయని, రైతుల శ్రమను దోచుకునేందుకు నో బిడ్‌ నాటకాలాడుతున్నారని ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు కిలో రూ.200కు కొనుగోలు చేస్తే బ్యారన్‌కు రూ.5 లక్షల వరకు నష్టం వస్తుందని చెప్పారు. పొగాకు పంట ద్వారా రూ.లక్షల కోట్ల ఆదాయం పొందుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతులకు న్యాయంగా దక్కాల్సిన ధరలు దక్కకుండా కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. రైతులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు ఆదుకున్న సందర్భాలు ఉన్నాయని, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

పొగాకు రైతులను దగా చేస్తున్న చంద్రబాబు: ఎం.ప్రభాకర రెడ్డి, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

పొగాకు ఉత్పత్తి వ్యయం కిలోకు రూ.250 కు పైగానే ఉందని, అయితే కిలో పొగాకు రూ.200 కు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించడం రైతులను దగా చేయడమేనని ఏపీ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ప్రభాకర రెడ్డి మండిపడ్డారు. గత ఏడాది కూడా ఇలాగే నమ్మించే ప్రయత్నాలు చేశారని, రైతుల పోరాటాల ఫలితంగానే నల్ల బర్లీ, తెల్ల బర్లీ పంటలు కొనుగోలు చేశారని గుర్తు చేశారు.

రైతు కూలి సంఘ జిల్లా నాయకులు ఎస్‌ లలిత కుమారి మాట్లాడుతూ... పొగాకు రైతుల ఓట్ల కోసం వచ్చే పాలకులకు వారి సమస్యలు మాత్రం పట్టకపోవడం దారుణమన్నారు. బోర్డు దగ్గర రైతుల డబ్బులు ఉన్నాయని, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. గిట్టుబాటు ధర కల్పించి, క్వింటా పొగాకు రూ.30 వేలకు కొనుగోలు చేసేంత వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. పొగాకు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీకి నగరంలో అడుగడుగునా సంఘీభావం పలికారు. అద్దంకి బస్టాండు సెంటర్‌ వద్ద వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ర్యాలీకి ఘన స్వాగతం పలికారు. సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ చుండూరి రంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్‌కే మాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఆర్‌.వెంకటరావు, రైతు సంఘం నాయకులు పమిడి వెంకటరావు, జజ్జురి జయంతి బాబు, సాగర్‌, హనుమారెడ్డి, కంకణాల ఆంజనేయులు, కల్పన, రమాదేవి, కేజీ మస్తాన్‌, కొండారెడ్డి, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement