కన్నతండ్రే కాలయముడై.. | - | Sakshi
Sakshi News home page

కన్నతండ్రే కాలయముడై..

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

క్షణికావేశంలో కర్కశంగా వ్యవహరించి ముగ్గురు పసిబిడ్డల ఉసురు తీసిన తండ్రి అనాలోచిత నిర్ణయంతో ఏకాకులుగా మిగిలిన తల్లి, భార్య ఒకే కుటుంబంలో తండ్రి, ముగ్గురు కుమార్తెల మృతితో అగ్రహారంలో విషాదఛాయలు

చీమకుర్తి: కంటికి రెప్పలా కాపాడుకుంటూ అల్లారు ముద్దుగా పెంచుతూ విద్యాబుద్ధులు నేర్పించిన తండ్రే ముగ్గురు కుమార్తెల ప్రాణాలను బలితీసుకున్నాడు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం చివరకు కోర్టుకెక్కి మూడేళ్లుగా సాగుతోంది. సమస్య పరిష్కారం కాకముందే పిల్లల తండ్రి మరణ శాసనం రాశాడు. తానూ బలవన్మరణం చెందాడు. శుక్రవారం చీమకుర్తి మండలం కేవీ అగ్రహారం గ్రామంలో తండ్రి తన ముగ్గురు కుమార్తెలకు కూల్‌డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చి చంపేసి..ఆపై తానూ ఉరేసుకుని చనిపోవడం ఆ గ్రామాన్ని విషాదంలో ముంచింది. ఈ సంఘటనలో ఏకుల సుధాకర్‌ (33) వేపచెట్టుకు ఉరేసుకున్నాడు. తొలుత గురువారం రాత్రే ముగ్గురు పిల్లలకు కూల్‌ డ్రింక్‌లో మత్తు పదార్థాలు ఇచ్చి బలవంతంగా వారి ప్రాణాలు తీశాడు. సుధాకర్‌ భార్య వెంకటేశ్వరమ్మకు 14 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయి. దాంతో భార్య వెంకటేశ్వరమ్మ తన పుట్టింటికి వెళ్లింది. ముగ్గురు పిల్లల్లో పెద్ద కుమార్తె గోఅచ్చుత బండ్లమూడి జిల్లా పరిషత్‌ హైస్కూలులో 8వ తరగతి చదువుతోంది. రెండో పాప పూజిత స్థానిక అగ్రహారం గ్రామంలోనే 5వ తరగతి, మూడో కుమార్తె లోహితశ్రీ 4వ తరగతి చదువుతున్నారు. ఇంతలో సుధాకర్‌, వెంకటేశ్వరమ్మ మధ్య వివాదం కోర్టు వరకు వెళ్లింది. తన భార్యతో తనకు విడాకులు కావాలని సుధాకర్‌ కోర్టులో కేసు వేశాడు. భార్య వెంకటేశ్వరమ్మ మాత్రం తనకు తన భర్త, పిల్లలు కావాలని కోర్టులో విడాకులు ఇవ్వడానికి నిరాకరించింది. కనీసం పిల్లలనైనా ఇవ్వాలని భార్య విజ్ఞప్తి చేసింది. మరో నాలుగు రోజుల్లో కోర్టు వాయిదా ఉండటంతో ఎలా తీర్పు వస్తుందనుకున్నాడో ఏమో సుధాకర్‌ నాలుగు రోజుల ముందే పిల్లలను చంపి తాను చావాలనుకున్నాడని జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఇంట్లో రెండు గేదెలు ఉంటే వాటిని రూ.1.20 లక్షలకు అమ్మినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం చీమకుర్తి వెళ్లి నైలాన్‌ తాడుతో పాటు కూల్‌ డ్రింక్స్‌ సీసాలను తెచ్చాడు. ఇంటిపైన మద్యం సీసాలు కూడా ఉన్నట్లు పోలీసుల పరిశీలనలో బయటపడింది. మద్యం తాగాకే పిల్లలకు కూల్‌ డ్రింక్‌లో విష పదార్థాలను కలిపి హత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. పిల్లలకు తండ్రి కుతంత్రం తెలియక తమను చీమకుర్తిలో సినిమాకు తీసుకెళ్లమని అడిగారు. తీసుకెళ్తానని నమ్మించి పసిబిడ్డల ఉసురు తీశాడు. పైగా సుధాకర్‌ తన తల్లికి జరిగిన నిజాలు చెప్పకుండా ఉదయాన్నే బయటకు వెళ్లి టిఫిన్‌ తెస్తానని చెప్పి తాను కూడా ఉరేసుకొని చనిపోయాడు.

సుధాకర్‌ ప్రైవేటు పాఠశాలలోని స్కూలు బస్సుకు డ్రైవర్‌గా వెళ్తూ ఇటీవల వచ్చిన వేసవి సెలవుల్లో రామతీర్థంలోని ఒక గ్రానైట్‌ క్వారీలో డ్రైవర్‌గా పనిచేస్తూ తన పిల్లలను చదివిస్తున్నాడు. చివరకు భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదం చిన్నదైనా ఇరువైపులా పెద్ద మనుషులు నచ్చచెప్తే సమస్య పరిష్కారమయ్యేది. అలా జరగకపోవడంతో చివరకు సుధాకర్‌ తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా బంగారు భవిష్యత్తు ఉన్న ముగ్గురి పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని బంధువులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్‌ తల్లిదండ్రులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారిలో చివరి వాడు సుధాకర్‌ వద్దే అతని తల్లి ఏకుల సుశీల ఉంటూ తన ముగ్గురు మనవరాళ్లను చూసుకుంటూ కాలం గడుపుతోంది. తీరా ఇప్పుడు చేరదీసిన కొడుకు లేడు. పిల్లలు, భర్తను కోల్పోయిన సుధాకర్‌ భార్య వెంకటేశ్వరమ్మ జీవితం కూడా ఒంటరైంది. తండ్రి, ముగ్గురు కుమార్తెల శవాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. సుధాకర్‌ తల్లి సుశీల ఫిర్యాదు మేరకు సీఐ డీ.ప్రసాద్‌, ఎస్సై సంపత్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. డీఎస్పీ ఆర్‌.శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement