● సర్ మ్యాపింగ్‌లో పక్షపాతం
● సచివాలయానికి పిలిపించుకొని ఓటర్ల సమాచారం సేకరిస్తున్న వైనం
● సచివాలయంలో బీఎల్‌ఓను నిలదీసిన వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి
ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలోని ఇస్లాంపేట వార్డు సచివాలయం పరిధిలో ఓటర్ల వెరిఫికేషన్‌కు సంబంధించి సర్ మ్యాపింగ్ విషయంలో బీఎల్‌ఓ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాడు. సర్ మ్యాపింగ్‌లో అధికార పార్టీ వాళ్లకు ఒక రకంగా.. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అభిమానులకు మరో రకంగా చేస్తున్నాడని విమర్శలు రేకెత్తాయి. 2002 ఓటర్ల జాబితా ప్రకారం మ్యాపింగ్ చేయాల్సి ఉంటే ఓటరు లిస్టులు మీరే తెచ్చుకోండి అని కొంతమందికి నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నాడని కొందరు వాపోతున్నారు. దానికి తోడు సచివాలయం పక్కనే ప్రత్యేకంగా ఒక కంప్యూటర్ సెంటర్‌ను ఏర్పాటు చేయించి వచ్చిన ఓటర్లను డబ్బులిచ్చి పక్కనే ఉన్న కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి ఓటరు లిస్టులు తెచ్చుకోండని చెబుతున్నారని స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్ ఇస్లాంపేట వార్డు సచివాలయానికి వెళ్లి బీఎల్‌ఓ లక్ష్మీ పుల్లయ్యను నిలదీశాడు. తమ వద్ద 2002 ఓటరు లిస్టులు లేవని, అందుకే కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి తెచ్చుకోవాలని చెబుతున్నామని సమాధానం చెప్పారు. దాంతో కఠారి శంకర్ సచివాలయంలో లేని ఓటరు లిస్టులు పక్కన ఉన్న కంప్యూటర్ సెంటర్‌లో ఏవిధంగా ఉంటాయని నిలదీశారు. అనంతరం కంప్యూటర్ సెంటర్‌కు వెళ్లి నిర్వాహకుడిని ఓటరు లిస్టులు నీ వద్ద ఎందుకు ఉన్నాయని నిలదీశాడు. దాంతో ఎలక్షన్ కమిషన్ సైట్‌లోకి వెళ్లి 2002 ఓటరు లిస్టులు తీస్తున్నానని సమాధానం చెప్పాడు. దాంతో కఠారి శంకర్ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని పేర్కొన్నారు.


