తల్లికి వందనం
అమలు మరో నెలన్నర తర్వాతే
బేస్తవారిపేట:
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అద్భుతాలు జరుగుతాయని ఆశపడ్డ తల్లులకు, విద్యార్థులకు చంద్రబాబు సర్కారు తొలిరోజే కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. ఎన్నికల ముందు తల్లికి వందనం అంటూ ఆర్భాటంగా ప్రచారం చేసిన బాబు..తీరా కుర్చీ ఎక్కాక మాట మార్చారు. బడ్జెట్ సాకులు చెప్తూ ఈ పథకాన్ని మరో రెండు నెలల పాటు అడ్డగోలుగా వాయిదా వేసి, లబ్ధిదారుల ఆశలపై చన్నీళ్లు చల్లారు. అటు స్కూళ్లు తెరిచి రోజులు గడుస్తున్నా..విద్యార్థులకు అందాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ అస్తవ్యస్తంగా మారింది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విద్యాకానుక, అమ్మ ఒడి పథకాలు నవరత్నాల్లా సాగిపోయాయి. కానీ, ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఆ ఊసే కరువైంది. తల్లికి వందనం కింద ప్రతి బిడ్డకూ న్యాయం చేస్తామన్న హామీని అమలు చేయడంలో సర్కారు మీన మేషాలు లెక్కిస్తోంది. మరో నెలన్నర రోజుల వరకు నిధులు విడుదల చేసే ప్రసక్తే లేదని సర్కారు తేల్చేయడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని లక్షలాది మంది తల్లులు లబోదిబోమంటున్నారు. స్కూళ్లు రీఓపెన్ అయిన తరుణంలో పుస్తకాలు, యూనిఫారాలు కొనుక్కోవడానికి చేతిలో పైసల్లేక పేద తల్లులు అల్లాడిపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో దాదాపు 2,838 పాఠశాలలు ఉండగా వాటిలో చదువుకుంటున్న 1.87 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్‌ను కూటమి సర్కారు అంధకారంలోకి నెట్టేస్తోంది. అటు తల్లులకు ఇచ్చే డబ్బులకూ దిక్కులేదు, ఇటు పిల్లలకు ఇచ్చే కిట్లకూ మోక్షం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు మార్క్ ‘పాలన’ అంటే ఇదేనా అని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి పథకం కింద సుమారు రూ.1700 కోట్లకు పైగా నిధులు ఏటా జూన్ తొలివారంలోనే అందజేశారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు చదివే లక్షలాది మంది విద్యార్థులకు ఈ నిధులు అందాయి. టీడీపీ ప్రభుత్వంలో మాత్రం విద్యార్థుల సంఖ్యను కత్తెర పెట్టేందుకు సిద్ధమైందన్న ఆరోపణలు క్షేత్ర స్థాయిలో బలంగా వినిపిస్తున్నాయి.
పథకానికి అర్హత సాధించాలంటే నిబంధనలు, సాంకేతిక కారణాలు సాధారణ పేద కుటుంబాలకు శాపాలుగా మారాయి. కూటమి సర్కారు ఉదాసీనత వల్ల ప్రతి ఏటా అర్హులైన వేలాది మంది విద్యార్థులు పథకానికి దూరవుతున్నారు. పథకం అమలు బాధ్యతలను విద్యాశాఖ, సమగ్రశిక్ష శాఖ, సచివాలయ సిబ్బందికి అప్పగించారు. మ్యాపింగ్ యాప్‌లు సరిగ్గా పనిచేయకపోవడం, సర్వర్ డౌన్ కారణంగా డేటా నమోదు నిలిచిపోయింది. విద్యార్థుల ఆధార్, ఇతర వివరాలు సరిచూసుకోవడానికి ఆధార్ అనుసంధానం, ఈకేవైసీ, బ్యాంక్ ఖాతాల మ్యాపింగ్ వంటి అంశాలపై సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వలేదు. తల్లిదండ్రులు సచివాలయాలు, పాఠశాలల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే మ్యాపింగ్ అస్తవ్యస్తంగా మారుతోంది.
కూటమి ప్రభుత్వం తెచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ ఉమ్మడి జిల్లాలో పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైంది. విద్యా సంవత్సరం ప్రారంభమై ఇన్ని రోజులైనా మెజారిటీ విద్యార్థులకు ఇంకా కిట్లు అందలేదు. ఎక్కడో ఒకచోట పంపిణీ చేసినా..అందులో నోట్‌బుక్స్, యూనిఫాం సైజులు సరిపోక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థను ఈ సర్కారు గాలికొదిలేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చిన ‘నాడునేడు’ లాంటి పథకాలను అటకెక్కించిన చంద్రబాబు సర్కారు..కనీసం పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూడా నిధులు ఇవ్వడం లేదు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కనీస నిధులు విడుదల కాకపోవడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వేలాది ప్రభుత్వ పాఠశాలలు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నాయి.
పేద తల్లిదండ్రులపై ఆర్థిక భారం
విద్యార్థులకు పూర్తి స్థాయిలో
అందని విద్యామిత్ర కిట్లు
నేటికీ అందని బ్యాగులు, షూ, బెల్ట్,
డిక్షనరీలు, యూనిఫామ్స్
మౌలిక వసతులను పట్టించుకోని
చంద్రబాబు సర్కారు
మౌలిక వసతులకు నిధులు నిల్..
క్షేత్ర స్థాయిలో అడ్డంకులెన్నో..
తల్లికి వందనం..వంచన
విద్యార్థి మిత్ర..అగమ్యగోచరం..


