ఒంగోలు సిటీ: అక్రమ అరెస్ట్‌లతో భయపెట్టాలనుకోవడం కూటమి ప్రభుత్వం భ్రమ అని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు బొట్ల సుబ్బారావు అన్నారు. శుక్రవారం ఒంగోలులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై వైఎస్సార్ సీపీ చేస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు కూటమి పాలకులు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. లేని మద్యం కేసులు సృష్టించి వైఎస్సార్ సీపీ నాయకులను వేధించడం చంద్రబాబు ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబాన్ని టార్గెట్ చేసి అతని కుమారుడు కారుమూరి సునీల్‌ను అక్రమంగా అరెస్టు చేశారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు పూర్తిగా పారదర్శకంగా జరిగాయన్నారు. 2014–19లో జరిగిన మద్యం అక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇప్పుడు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్న ప్రభుత్వం.. తన వైఖరి మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తప్పుడు వార్తలు, తప్పుడు కేసులతో వైఎస్సార్ సీపీని దెబ్బతీయాలని ప్రయత్నించినా ప్రజల మద్దతు చెరపలేరన్నారు. అక్రమ అరెస్టులు, సమన్లు, బెదిరింపులతో వైఎస్సార్ సీపీ నాయకత్వాన్నిగానీ, బీసీ యువత ఆత్మగౌరవాన్నిగానీ అణచలేరన్నారు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులపైనే వరుసగా కేసులు పెట్టడం రాజకీయ కక్షసాధింపులకు నిదర్శనమన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెబుతూనే.. రాజకీయ కక్షసాధింపులకు దర్యాప్తు సంస్థలను వాడుకోవడం సిగ్గుచేటన్నారు. వేధింపులు పక్కనపెట్టి ఆధారాలతో కూడిన నిష్పక్షపాత విచారణ చేయాలన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సమర్థవంతంగా పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోందన్నారు. రాజమహేంద్రవరం కల్తీ పాలు ఘటనలో 16 మంది మృతి చెందినా కారణాలు వెలుగులోకి రాలేదన్నారు. విజయవాడలో సాయికృష్ణ ఘటనలోనూ బాధిత కుటుంబానికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాతే ప్రభుత్వం స్పందించడం పరిస్థితికి అద్దం పడుతోందని బొట్ల సుబ్బారావు అన్నారు.
కారుమూరి సునీల్ యాదవ్‌కు
అండగా ఉంటాం...
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఏలూరు పార్లమెంట్ ఇన్‌చార్జ్ కారుమూరి సునీల్‌కుమార్ యాదవ్‌ను అక్రమంగా అరెస్టు చేశారని బొట్ల సుబ్బారావు అన్నారు. డీఎస్సీ–2025 కుంభకోణం, తునిలో చిన్నారి అదృశ్యం, విజయవాడలో సాయికృష్ణ లాకప్ డెత్, క్రాంతికుమార్ ఆత్మహత్య వంటి ఘటనలపై చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్సార్ సీపీ ఎండగడుతుండటంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. రెండేళ్ల కూటమి పాలనలో వైఫల్యాలపై రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన నిరసనలతో ప్రభుత్వం ఉలిక్కిపడిందన్నారు.
అలా అనుకోవడం కూటమి ప్రభుత్వ భ్రమ
రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే కారుమూరి సునీల్ అరెస్టు
బీసీ యువనేతగా సునీల్ ఎదుగుదలను
అడ్డుకునేందుకు కుట్ర
లేని మద్యం కేసుతో వైఎస్సార్ సీపీ
నాయకులను వేధిస్తున్నారు
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు
వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు
బొట్ల సుబ్బారావు
2014–19లోనే అసలైన మద్యం స్కాం...
2014–19 మధ్యలో చంద్రబాబు పాలనలోనే అసలైన మద్యం స్కాం జరిగిందని అందరికీ తెలుసని బొట్ల సుబ్బారావు ఆరోపించారు. కానీ, ఇప్పుడు మద్యం రవాణా పేరుతో అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ప్రస్తుతం సందుసందుకీ బెల్ట్ షాపులు నడుస్తున్నాయన్నారు. మద్యం బాటిల్‌పై అదనంగా రూ.20 వసూలు చేస్తున్నారన్నారు. ఈ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తోందో ప్రభుత్వం చెప్పాలని సుబ్బారావు ప్రశ్నించారు. మద్యం ధరలపై ఆందోళన చేసినా.. అక్రమాలకు పాల్పడిన దుకాణాలపై చర్యలు తీసుకోలేదన్నారు. ఆక్వా రైతులు రోడ్లపైకి వచ్చి ఫీడ్ బస్తాలను దహనం చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జరిగిందన్నారు. గతంలో ధరలు పెరిగితే జే ట్యాక్స్ అని విమర్శించిన వారు, ఇప్పుడు జరుగుతున్న దోపిడీ ఎవరి ట్యాక్సో చెప్పాలని పుప్పాల వాసుబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ సహా అనేక హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని, ఇప్పుడు ఆ హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. పాఠశాలలు ప్రారంభమైనా తల్లికి వందనం పథకం జాడ లేదన్నారు. కార్యక్రమంలో బీసీ సెల్ నాయకులు ఫణిదపు సుధాకర్, షేక్ మీరావలి, కె.రాము, తదితరులు పాల్గొన్నారు.


