అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారంపై దృష్టి సారించాలి

Jun 20 2026 11:43 AM | Updated on Jun 20 2026 11:43 AM

సీఎస్‌ పురం (పామూరు): రెవెన్యూ సమస్యలపై వచ్చిన అర్జీల పరిష్కారంపై ఆయా మండలాల తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మార్కాపురం జిల్లా కలెక్టర్‌ విజయ సునీత ఆదేశించారు. మండల కేంద్రమైన సీఎస్‌ పురంలోని ఆర్‌ఎంఎస్‌ కల్యాణ మండపంలో శుక్రవారం కనిగిరి నియోజకవర్గస్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్‌ పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూములను ఆన్‌లైన్‌ చేయడం, ఇతర భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని తెలిపారు. అర్జీలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. కనిగిరి నియోజకవర్గంలోని పామూరు, సీఎస్‌ పురంలో నిర్వహించిన ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌లపై త్వరలో ప్రత్యేక సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. అధికారులు ఇప్పటి నుంచే సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన అర్జీలపై ఉదాసీనంగా వ్యవహరించకుండా నిబంధనలను అనుసరించి పరిష్కరించాలని, అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

పరిహారం ఇప్పించాలని వినతి...

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో భూములు కోల్పోయిన రైతులు కలెక్టర్‌ను కలిశారు. ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని, తక్షణమే పరిహారం ఇప్పించాలని కోరుతూ మండలంలోని దర్శితిమ్మక్కపల్లి గ్రామ రైతులు పీజీఆర్‌ఎస్‌లో వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన జేసీ పులి శ్రీనివాసులు.. పూర్తిస్థాయిలో రికార్డులతో 29వ తేదీ మార్కాపురం రావాలని తహసీల్దార్‌ ధర్మతేజను ఆదేశించారు. రైతులకు పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, పీజీఆర్‌ఎస్‌లో మొత్తం 254 అర్జీలు రాగా, వాటిలో రెవెన్యూకు సంబంధించి 224 అర్జీలు అందాయి. ఇతరాలకు సంబంధించి 30 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓ తోట అజయ్‌కుమార్‌, హౌసింగ్‌ పీడీ మోహన్‌రావు, జిల్లా మైనింగ్‌ అధికారి రవిప్రసాద్‌, ఐసీడీఎస్‌ ఇన్‌చార్జ్‌ పీడీ పద్మావతి, డీఆర్‌డీఏ పీడీ శివన్నారాయణ, డీడీఓ కే శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ వి.ప్రతాప్‌రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ బ్రహ్మానందరెడ్డి, ఎంఈఓలు రాజాల కొండారెడ్డి, జె.ప్రసాదరావు, పామూరు, వెలిగండ్ల, కనిగిరి, పీసీ పల్లి, హెచ్‌ఎం పాడు మండలాల అధికారులు పాల్గొన్నారు.

అర్జీదారుని సమక్షంలోనే సమస్య

పరిష్కరించాలి

అధికారులతో కలెక్టర్‌ విజయ సునీత

కనిగిరిలో నియోజకవర్గస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement