● ఒకరు మృతి
బేస్తవారిపేట: టిప్పర్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బేస్తవారిపేట మండలంలోని మోక్షగుండం సమీపంలో ఒంగోలు–నంద్యాల హైవేరోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఇసుక లోడు కోసం గిద్దలూరు వైపునకు వెళ్తున్న టిప్పర్‌ను ఎదురుగా వచ్చిన డోన్ నుంచి గుంటూరు వైపునకు వెళ్తున్న ఎరువులు, పురుగుమందుల లారీ (ఐచర్) రాంగ్‌రూట్‌లో ఢీకొట్టింది. ఈ సంఘటనలో అర్థవీడు మండలం చిన్నకందుకూరుకు చెందిన టిప్పర్ డ్రైవర్ పుప్పాల దానమయ్య (45) అక్కడికక్కడే మృతిచెందాడు. లారీ డ్రైవర్ బీ సుధాకర్ తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అతన్ని కర్నూలు తరలించారు. ఈ సంఘటనలో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతుడికి భార్య మరియమ్మ, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


