హనుమంతునిపాడు: ఫ్యాన్‌కు ఉరేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హనుమంతునిపాడు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో వెంగపల్లి ఎస్సీకాలనీలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. మేళం వెంకటేశ్వర్లు, శాంతి దంపతుల కుమార్తె మేళం గీతాంజలి (16) కనిగిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తిచేసింది. మంచి మార్కులు సాధించడంతో యాజమాన్యం రూ.2 వేలు నగదు బహుమతి కూడా అందించింది. పాఠశాల స్థాయి నుంచే కష్టపడి చదువుతూ ఇంటర్ ఫస్టియర్‌లోనూ మంచి మార్కులు సాధించింది. కాగా, గీతాంజలి అప్పుడప్పుడు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటుంది. తండ్రి వెంకటేశ్వర్లు కనిగిరిలోని ఓ ప్రైవేటు పాఠశాల వ్యాన్‌కు డ్రైవర్‌గా పనిచేస్తుంటారు. తల్లి కనిగిరిలోని పెట్రోల్ బంకులో పనిచేస్తుంటుంది. రోజూ రాత్రి 7 గంటలకు వారు ఇంటికి వస్తారు. గీతాంజలికి కళాశాలకు సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటోంది. తల్లిదండ్రులు రోజూలాగే పనికి వెళ్లి గురువారం రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి కుమార్తె గీతాంజలి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఉండటంతో వారు కుప్పకూలిపోయారు. కడుపునొప్పి తాళలేకనే ఆత్మహత్య చేసుకుని ఉంటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు కాగా, కుమారుడు ఒంగోలు చదువుతున్నాడు. మృతురాలు గీతాంజలి రెండో సంతానం. గ్రామంలో నూతనంగా పోలేరమ్మ గుడి నిర్మించి గురువారం విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ కార్యక్రమానికి కూడా గీతాంజలి వెళ్లివచ్చిందని, భోజన ఏర్పాట్లకు సంబంధించి కూరగాయలు కూడా కోసి వచ్చిందని, ఇంతలోనే ఇలా చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని బంధువులంతా కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజ్‌కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వివరాలడిగి తెలుసుకున్నారు. కడుపునొప్పి తాళలేకనే తమ కుమార్తె ఉరేసుకుని మృతి చెంది ఉంటుందని తల్లిదండ్రులు చెప్పడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టనున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


