కాపు యువకుడు సాయి కృష్ణ కేసు విషయంలో మౌనం ఎందుకు నీ కోసం పనిచేసిన వారు హత్యకు గురైనా మాట్లాడవెందుకు స్వయంగా జనసేన కార్యకర్తలపై దాడులు చేసినా పట్టించుకోకపోతే ఎలా రెడ్‌బుక్ రాజ్యాంగంలో కాపులపై కక్ష సాధింపులు టీడీపీతో కలిసి కాపులను అణచివేస్తున్నట్లు భావించాల్సి వస్తుంది కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కాపులపై పెరిగిన దాడులు సాయికృష్ణ కేసును సీబీఐకి అప్పగించాలి కాపులకు అన్యాయం జరిగితే పార్టీలకతీతంగా ఉద్యమాలు చేస్తాం ఒంగోలు వైఎస్సార్ సీపీ కార్యాలయంలో కాపు నాయకుల హెచ్చరిక
ఒంగోలు టౌన్: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రాష్ట్రంలో కాపులపై దాడులు నిత్యకృత్యమై పోయాయని, రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదోక చోట కాపులపై దాడులు జరుగుతున్నా కాపులకు పెద్దన్నగా ఉంటానని చెప్పి ఓట్లేయించుకొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోరు విప్పి ఒక్క మాట మాట్లాడడంలేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ఒంగోలు నియోజకవర్గ పరిశీలకుడు వై.వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్కాపురంలో జుమాటోలో పనిచేసుకుంటూ జీవిస్తున్న గాదె సాయికృష్ణ అనే కాపు యువకుడిని విచారణ పేరుతో విజయవాడ కృష్ణలంక పోలీసులు తీసుకెళ్లి 14 రోజులవుతున్నా ఇప్పటి వరకు ఆచూకీలేదని తెలిపారు. కుమారుడి ఆచూకీ కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన అతడి తల్లి విజయలక్ష్మిని అక్కడి పోలీసులు నీ కుమారుడు లేడని, ఫొటోకు దండ వేసుకొని చూసుకొమ్మని సలహా ఇవ్వడం పలు సందేహాలను రేకెత్తిస్తుందని చెప్పారు. సాయికృష్ణ మీద నేరాలు ఉంటే చట్టపరంగా విచారించి శిక్షించాలని, దానికి తమకెలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. అయితే పోలీసులు సాయికృష్ణను లాకప్ డెత్ చేసినట్లు వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయని చెప్పారు. గత ఎన్నికల్లో సాయికృష్ణ కుటుంబం జనసేన విజయం కోసం పనిచేసిందని, స్వయంగా జనసేన కార్యకర్త పోలీసుల లాకప్‌లో చనిపోయినట్లు వార్తలు వస్తున్నా డిప్యూటీ సీఎంగా బాధ్యతాయుత పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం వెనక మతలబేమిటని ప్రశ్నించారు. పవన్ కోసం కాపులందరూ పల్లకీలు మోశారని, ఇప్పుడు ఆపదలో ఉన్నప్పుడు మాట్లాడకపోవడం దారుణమని చెప్పారు. సాయికృష్ణ బతికి ఉంటే వెంటనే హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశాలను పోలీసులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గానికి చెందిన సీఐ చేత సాయికృష్ణను వేధించడం వల్లనే మరణించి ఉంటాడని, చంద్రబాబు ప్రభుత్వం కాపుల చేతే కాపులపై దాడులు చేయించడం, హత్యలు చేయించడం వంటి ఘోరాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కందుకూరులో కాపు యువకుడిని కారుతో తొక్కించి అత్యంత దారుణంగా హత్య చేసినా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఒక్కమాట కూడా మాట్లాడలేదని, ఇప్పుడు సాయికృష్ణ కాలిబూడిదైనా మాట్లాడడంలేదని ఆవేదన వెలిబుచ్చారు. మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంటిని కూల్చివేశారని, మంగళగిరిలో ఫ్లెక్సీ కట్టిన నేరానికి కేసు పెట్టారని చెప్పారు. రాష్ట్రంలో కాపులను చిన్నచూపు చూస్తున్నారని, అడుగడుగునా అణచివేస్తున్నారని చెప్పారు. ఇప్పుటికై నా రాష్ట్రంలోని కాపులు, జనసేన నాయకులు, కార్యకర్తలు మేలుకోవాలని పిలుపునిచ్చారు. కాపులను టీడీపీకి తొత్తుల్లాగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, వంగవీటి రంగా వంటి మహనీయుడి వారసత్వాన్ని కొనసాగించే కాపులు ఈ కుట్రలను సాగనివ్వరని తేల్చి చెప్పారు. కాపు నాయకుడు వంగవీటి రంగాను ఆనాడు ఏవిధంగానైతే మట్టుబెట్టారో అదేవిధంగా నేడు కాపు నాయకులను అణచివేసేందుకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సాయికృష్ణ కేసును సీబీఐ చేత విచారణ జరపాలని, టీడీపీకి చెప్పినట్లు వినే రాష్ట్ర అధికారుల విచారణతో న్యాయం జరగదని చెప్పారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి కాపులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు.
కాపులపై పెరిగిన దాడులు:
పార్టీ డివిజన్ అధ్యక్షుడు పాలడుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీసు విచారణకు తీసుకెళ్లిన సాయికృష్ణ 14 రోజులుగా కనిపించకుండా పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో కాపులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని 27 శాతం కాపులు ఏకమై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకుడు తోట సాయి నవీన్ మాట్లాడుతూ...లోకేష్ రెడ్‌బుక్‌లో జనసేన మీద కక్ష తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. ఏదైనా ఘోరం జరిగినప్పుడు గతంలో బీహార్‌తో పోల్చేవారని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో పోలుస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కాపు నాయకుడు ముద్రగడను వేధించారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి మరో కాపు నాయకుడు అంబటి రాంబాబును వేధింపులకు గురిచేశారని గుర్తు చేశారు. జిల్లా యువజన జనరల్ సెక్రటరీ అడుసుమల్లి ప్రసన్న మాట్లాడుతూ సాయికృష్ణ తల్లి దగ్గర నుంచి ఫోన్ లాక్కున్న పోలీసులు అందులో ఉన్న ఫొటోలను డిలీట్ చేయడం దుర్మార్గమన్నారు. సాయికృష్ణ తల్లిని మానసికంగా వేధిస్తున్న పోలీసులను డిస్మిస్ చేయాలని కోరారు. సమావేశంలో యువజన విభాగం నియోజకవర్గం అధ్యక్షుడు మలిశెట్టి దేవా, సీనియర్ నాయకులు రాయిని వెంకటరావు, అరిగే మల్లికార్జునరావు, కోవూరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


