ఒంగోలు సబర్బన్: ‘రెండేళ్లుగా పీఆర్సీ లేదు.. ఐఆర్ ఇవ్వరు.. డీఏ ఊసెత్తడం లేదు. అందుకే ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమవుతున్నాం’ అని ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా చైర్మన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ నాయకులు గురువారం ఒంగోలు ఆర్‌డీఓ కార్యాలయం ముందు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుతో పాటు రాష్ట్ర కమిటీ నాయకులతో కూడిన ఫ్లెక్సీని ప్రదర్శించి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్యాలయానికి వెళ్లి ఏపీ జేఏసీ అమరావతి చేపట్టిన ఉద్యమ కార్యాచరణ గురించి ఉద్యోగులకు వివరించారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పిన్నిక మధుసూదనరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో హక్కుల సాధన కోసం రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు ఆధ్వర్యంలో పోరాట కార్యాచరణ ప్రకటించారన్నారు. ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నా ప్రభుత్వం కనీసం చైర్మన్‌ను కూడా నియమించలేదన్నారు. ఐదు డీఏలు ఇవాల్సి ఉన్నా వాటి పైనా మాట్లాడడం లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో మంచి ఐఆర్ ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. మరోపక్క ఆర్జిత సెలవుల నగదు, డీఏలు, ఇతర సదుపాయాలు అన్నీ ఎగనామం పెట్టి ఉద్యోగులతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఒత్తిడి వల్లే గుండెపోటు, ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులకు రెండు, మూడు రకాల పనులు ఒకేసారి అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హక్కుల సాధన, వివిధ సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రానున్న కార్యక్రమాల్లో ప్రతి ఉద్యోగి చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని పిన్నిక పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను
వెంటనే అమలు చేయాలి
ఉద్యోగుల హక్కుల సాధన కోసం కార్యాచరణ
ఏపీ జేఏసీ అమరావతి తరఫున
ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం
ఏపీ జేఏసీ అమరావతి ప్రకాశం జిల్లా చైర్మన్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు పిన్నిక మధుసూదనరావు


