చట్ట సవరణతో టెట్‌ మినహాయించాలి | - | Sakshi
Sakshi News home page

చట్ట సవరణతో టెట్‌ మినహాయించాలి

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

చట్ట సవరణతో టెట్‌ మినహాయించాలి విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

మార్కాపురం టౌన్‌: ఆర్‌టీఈ చట్ట సవరణ ద్వారా 2010 టెట్‌ నోటిఫికేషన్‌కు ముందు నియామకం పొందిన ఉపాధ్యాయులను టెట్‌ తప్పనిసరి ఉత్తీర్ణత నుంచి మినహాయింపు కల్పించాల్సిందిగా కలెక్టర్‌ విజయ సునీతకు ఏపీ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కే శంకర్‌రావు, కే శ్రీనివాసులు వినతిపత్రం గురువారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ద్వారా ప్రధానికి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి, సీఎంకు ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం మార్కాపురం జిల్లా శాఖ తరఫున వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవతో పార్లమెంట్‌లో చట్టసవరణ ద్వారా ఉపాధ్యాయులు టెట్‌ తప్పనిసరి ఉత్తీర్ణత నియమం 2010 టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తేదీ నుంచి అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మార్కాపురం: రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీ రవీంద్రారెడ్డి, డీపీ రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. విశ్రాంత ఉద్యోగుల భవనంలో గురువారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగి రిటైర్‌మెంట్‌ రోజునే అన్నీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరారు. ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏలు వెంటనే ఇవ్వాలని, పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మార్కాపురం శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ బాలసుబ్బారావు పాల్గొన్నారు.

పుల్లలచెరువు: బైకుపై వెళ్తూ గేదెను ఢీకొని అదుపుతప్పి ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మర్రివేముల పంచాయతీ ఎర్రపాలెం వద్ద గురువారం జరిగింది. వివరాలు.. మర్రివేముల పంచాయతీకి చెందిన వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ సెక్రటరీ రావూరి ఆశోక్‌ (40) తన మామ దినదిశకర్మ సందర్భంగా అవసరమైన సరుకులు తెచ్చేందుకు బైకుపై పక్క గ్రామం వెళ్లి వస్తుండగా గేదె అడ్డువచ్చింది. బైకు అదుపుతప్పి దాన్ని ఢీకొనడంతో ఆశోక్‌ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. తనతో పాటు ఉన్న మల్లికార్జునకు తీవ్రగాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు. మృతుడు ఆశోక్‌కు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న యర్రగొండపాలెం శాసనసభ్యుడు తాటిపర్తి చంద్రశేఖర్‌, పార్టీ మండల కన్వీనర్‌ దోమకాలు వెంకటేశ్వర్లు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement