● 1.10కేజీల గంజాయి స్వాధీనం
కందుకూరు: కందుకూరు ప్రాంతంలో గంజాయి సరఫరా చేస్తున్న కీలక నిందితున్ని అరెస్టు చేసినట్లు డీఎస్పీ సీహెచ్‌వీ బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రమైన గుడ్లూరులోని ఎరుకలపాలెంకు చెందిన నాగులూరి తిరుపతయ్య అనే వ్యక్తి విశాఖ ప్రాంతం ఉంచి గంజాయి తీసుకొచ్చి కందుకూరు ప్రాంతంతో పాటు, ఇతర ప్రాంతాల్లో కూడా గంజాయిని సరఫరా చేసేవాడు. ఇతని కోసం గత కొంత కాలంగా పోలీసులు నిఘా ఉంచారు. దీనిలో భాగంగా బుధవారం పట్టణ సమీపంలో ఉండగా అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం తిరుపతయ్య వద్ద నుంచి 1.100 గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసులోని మరికొందరు కీలక నిందితుల కోసం గాలింపు చేపడతామని తెలిపారు. గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయం, సరఫరా, వినియోగం సంబంధించిన ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 112, 1972 కందుకూరు పట్టణ ఎస్సై సెల్ నంబర్ 9121102203, సీఐ 91221102202, పోలీస్ వాట్స్‌యాప్ నంబర్ 9121102266 నంబర్‌కు సమాచారం ఇవ్వవచ్చన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ అన్వర్‌బాష, పట్టణ ఎస్సై శివనాగ రాజు తదితరులు పాల్గొన్నారు.


