● ముళ్ల పొదల్లో ఏడు నెలల మగ శిశువు మృతదేహం
ఒంగోలు టౌన్: ఏతల్లి కన్నబిడ్డో.. నవమాసాలు నిండకుండానే నిండు నూరేళ్లు నిండాయి. అమ్మపొత్తిళ్లలో వెచ్చగా నిద్రపోవాల్సిన బిడ్డ నిర్జీవంగా చెత్తకుండీకి చేరాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు నగర శివారులోని గాంధీరోడ్డులో ఒక ప్రైవేటు స్కూలు ఎదురుగా ముళ్ల పొదల్లో ఏడు నెలల శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ బీవీ సాగర్‌కు సమాచారం ఇచ్చారు. ఆయన జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, జిల్లా మహిళ శిశు సంక్షేమ అధికారి పి.నాగమణి దృష్టికి తీసుకెళ్లారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు, తాలూకా పోలీసులు శిశువు మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. శిశువును పారవేసిందెవరు, అనారోగ్యంతో మరణించాడా... లేక ఇతరత్రా విషయాలను విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్త అరుణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


