కంభం:
లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ఏడాది పాటు కాపాడుకుంటూ వచ్చిన పసుపు పంట ఓ వైపు ఆశించిన స్థాయిలో దిగుబడి రాక మరో వైపు గిట్టుబాటు ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సుమారు 900 ఎకరాల్లో పసుపు పంట సాగు చేస్తుండగా పశ్చిమ ప్రకాశంలో చారిత్రాత్మక కంభం చెరువు ఆయకట్టు పరిధిలో రైతులు అధికంగా పసుపు సాగు చేస్తుంటారు. మార్చి నెల మొదటి వారం నుంచి పసుపు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. దిగుబడి చూస్తుంటే సగానికి పైగా తగ్గిపోయిందని ఎకరాకు 10–15 క్వింటాళ్ల దిగుబడి కూడా రావటం లేదని, దీంతో ఈ ఏడాది కూడా అప్పులపాలు కావాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు.
పెరిగిన పెట్టుబడులు:
యూరియా, ఇతర ఎరువుల కొరతతో ధరలు పెంచేయడంతో గతంతో పోలిస్తే ఈ ఏడాది పసుపు పంటకు పెట్టుబడులు పెరిగాయని రైతులు వాపోతున్నారు. విత్తనం పసుపు కొనుగోలు, కలుపు తీయడం, నీటి పారుదలకు కలిపి ఎకరాకు సుమారు రూ.లక్ష వరకు ఖర్చు వస్తుండగా పసుపు పంటను తవ్విన తర్వాత నూర్పిడికి, పాలిషింగ్‌కు రూ.30 – రూ.40 వేల వరకు ఖర్చవుతుంది. కౌలు రైతులకు అదనంగా రూ.20 వేల వరకు ఖర్చు పెరుగుతుంది. మొత్తంగా ఎకరా పసుపునకు సుమారు రూ.లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు.
మోంథా తుఫాన్‌కు దెబ్బతిన్న పసుపు పంట:
ఈ ఏడాది మోంథా తుఫాన్ ప్రభావం పసుపు పంటపై తీవ్రంగా చూపించింది. చెరువులు, వాగుల ఆయకట్టు వెంబడి ఉన్న పసుపు పంటలు మొత్తం సుమారు పది రోజులపైగా నీళ్లలో మునిగిపోయి ఉండటంతో పంట పూర్తిగా చెడిపోయి ఎకరాకు 5 క్వింటాళ్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సందర్భాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంట దెబ్బతింది. గతంలో ఎకరాకు దాదాపు 50–60 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండగా ప్రస్తుతం 20 క్వింటాళ్లకు పడిపోయిందని, దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల్లో పడిపోయిన ధరలు:
రెండు మూడు నెలల క్రితం క్వింటా పసుపు రూ.15 వేలు ఉండటంతో దిగుబడి తగ్గినా మంచి ధర ఉందిలే పెట్టిన పెట్టుబడులైనా వస్తాయన్న నమ్మకంతో రైతులు ఉన్నారు. తీరా పంట తవ్వకాలు మొదలు పెట్టే సమయానికి క్వింటా పసుపు రూ.12 వేలకు పడిపోయిందని తెలియడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఒక దశలో రూ.9 వేలకు కూడా తగ్గింది. ఓ వైపు దిగుబడులు రాక, మరోవైపు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుఫాన్ దాటికి పంట దెబ్బతిని నేటికీ నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రస్తుతం పతనమైన ధరలు మరింత నష్టాన్ని చేకూరుస్తున్నాయి.
పసుపులో అంతర పంటగా అరటి సాగు:
పసుపులో రైతులు అంతర పంటగా అరటి పంట సాగు చేస్తారు. పసుపు కోతలకు మూడు నెలల ముందు రైతులు పసుపు సాళ్లలో అరటి పిలకలు వేస్తారు. పసుపు పంట తవ్వకాలు పూర్తయ్యే సరికి అరటి పంటకు 3 నెలల కాలం కలసి వస్తుంది. తద్వారా అరటి తోటలు త్వరగా కాపునకు వస్తాయి. పసుపు పంటలో పూర్తిగా నష్టపోయిన తమకు అరటైనా గట్టెక్కిస్తుందా అని రైతులు చర్చించుకుంటున్నారు.


